ప్రపంచ విజ్ణానాన్ని పెంచే విశ్వవిద్యాలయాలను చూసినప్పుడు కలిగే గౌరవనీయమైన భావం చెప్పనలవికాదు. .
జ్ఞాన బంఢాగారముగా, విద్యలకే కాదు, విధ్యార్థులను ఉన్నతమైన విలువలు గల మానవులుగా మార్చి, వారిలో ఒక వ్యక్తిత్వం నెలకొల్పి, యువతకు జీవితంలో విజయానికి సోపాన మార్గాలు. అందుకే ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు దర్శనీయ ప్రదేశాలే మరి!.
అందునా అమెరికాలో విశ్వవిద్యాలయాలు ప్రపంచములో ప్రథమ స్థానములో నిలబడి వాటి ఘనత చాటుతాయి.
నాకు అలా స్టాంఫోర్డ్ చూడటం చాలా గొప్ప అనుభూతిని కలిగించిన విషయం కాలిఫోర్నియా యాత్రలో.
చిన్నారి మా చిట్టి తల్లి, తన రెక్కలు చాచుతూ, ఎగురుతూ ఫశ్చిమ తీరాన ఉన్న స్టాంఫోర్డ్ లో చేరింది. వెళ్ళి సెటిల్ అవుతుంది అని, దేశాలు తిరిగిన అనుభవశాలి అని అనుకున్నాను.
కానీ వెళ్ళిన వారంలో ఒక శనివారం రాత్రి, ఈ అపార్ట్మెంట్ సెట్ చేసు కోవాలని మూతి సాగదీసి అడిగిన తీరు మూడేళ్ళ చిన్నారే ఇది, ఏమి సాధించినా అన్న విషయం గుర్తుకు చేసింది. మరు రోజు నేను హుటా హుటిన బయలుచేరి, ఈ 5 గంటల విమాన దూరం దాటి, ఆ సాయంత్రం దాని ముందు ఉన్నాను. మరు రోజు నుంచి, తన ఆఫీస్ లో దింపటం, సామానుకై వెతకటం, సాయంత్రం మళ్ళీ దాని, వాళ్ళ హాస్పిటల్ భవనం దగ్గర పిక్ చేసుకోవటం…గడిబిడి గా, గజిబిజి గా సాగింది.
ఆ ప్రయాణం లో నాకు నచ్చింది రెండే రెండు. చంద్ర ను కలవటం.
స్టాంఫోర్డ్ టూర్ తిరగటం. ఆ కాలేజీ వరండాలలో నిలబడితే మా ఉస్మానియా గుర్తుకువచ్చింది. తల్లి వాగ్దేవి చరణ మంజీరాల ధ్వనులు వినపడ్డాయి. అమ్మ పదపల్లవులు నాట్యమాడుతున్న ఆ విజ్ఞాన మందిరము నిజంగా దేవాలయమే!
ఈ విశ్వవిద్యాలయం మొదలెట్టటం గురించి మనకు ఈ మధ్యనో, ఎప్పుడో ఒక కథ నానింది. ఐవీ లీగ్(Ivy League) లో తన పుత్రునికి సీట్ రానందుకు, ఐవీ లీగ్ కాలేజీ గడప దగ్గర ఈ ధనవంతుని నిలిపి వేసినందుకు, ఆ కసి లో ఈ విశ్వవిద్యాలయం ప్రారంభించారని. కానీ అది ఉట్టి పుకారు కథ.
నిజానికి ఈ విద్యాయాలయాన్ని ప్రారంభించిన లీలాండ్ స్టాంఫోర్డ్ అమెరికా సెనేట్ సభ్యుడు, కాలిఫోర్నియా గవర్నర్ కూడాను. ఆయన చాలా చిన్నతనంలో (15 సం।।)మరణించిన తన పుత్రుని పేరుమీద ఈ విశ్వవిద్యాలయాన్ని 1885 లో ప్రారంభించారు. ఆయన భార్య అయిన జేన్ స్టాంఫోర్డ్ కూడా ఇందులో భాగస్వామి.
ఈ విశ్వవిద్యాలం ప్రారంభించిన మూడు సంవత్సరాలకే లీలాండ్ మరణించారు. భార్య నిలబెట్టింది ఒక విధంగా. చాలా పురోగామిగా, ప్రపంచాన్ని దిశా నిర్దేశాన్ని పంచే విధంగా ఈ విద్యాలయ విలువలతో తీర్చిదిద్దారు. 8180 ఎకరాల ప్రైవేట్ స్థలాన్ని కొని, ఈ విశ్వవిద్యాలయాన్ని మొదలెట్టారు. ‘పలావాల్టా’ పట్టణము లో మొదలైన ఈ విశ్వవిద్యాలయం ఇప్పటివరకు 83 నోబెల్ ప్రైజులు ను ఎన్నో ఒలంపిక్ మెడల్సు ను దేశానికి తన వంతుగా అందించింది.
ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాల సరిసాటిగా వెస్ట్ కోస్ట్ లో విజయకేతనం ఎగుర వేస్తోంది.
ప్రారంభంలో ఈ విశ్వవిద్యాలయాలకు ధనం కొరత వచ్చినందున, అక్కడ స్థానికంగా వ్యాపార వాణిజ్యాలను ప్రోత్సహించి తద్వారా విద్యాలయాన్ని నడిపే ఏర్పాటు చేశారు. అలా అభివృద్ధి చెందినదే ప్రపంచాన్ని ముందుండి నడిపిస్తున్న సిలికాన్ వాలీ.
అసలు కాలిఫోర్నియా రాష్ట్రమే చాలా ముందు చూపుతో సాగుతున్నదని, ప్రోగ్రసివ్ రాష్ట్రము అని పేరు. భారతీయులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే రాష్ట్రము అని కూడా అంటారు.(నాకు మా అట్లాంటా నే ఇష్టం). పెట్రోల్ కు బదులుగా శక్తి ఉత్పాదనలు ప్రొత్సహించటం, సైకిలు వాడకం ఎక్కువ. యోగ కూడా చాల ఎక్కువ గా కనిపిస్తుంది. భారతీయరుచి కోసం మనం ఎక్కడో వెతనక్కర్లేదు. ప్రతి వీధి చివర ఉంటాయని ప్రసిద్ధి. అలాంటి ప్రదేశంలో, ఫసిపికు మహా సముద్రానికి దగ్గరలో ప్రశాంత , చక్కటి వాతావరణంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలలో అగ్రగామిగా నిలవటం ఆశ్చర్యం లేదుగా.
అది తప్పక దర్శనీయమైన ప్రదేశాలలో ఒకటి.