మరో రోజు ప్రారంభం, తప్పదు మనకు వంటింటి తో సహవాసం.
ఇంత పెద్ద వంటగది పెట్టుకున్నది మరి అందుకే జంజాటము…
వంటింట్లో ఉండటం తప్పదు,
అటు – ఇటు గిరగిరా తిరగలిలా తిరగటమూ తప్పదూ.
గడబిడి లేకుండా ఆ మూల నుంచి ఈ మూలకూ తిరిగితే కొంత వర్కౌట్,
సందులో సడేమియాలా కాస్త కమ్మనివి వండవచ్చు!
ఫ్రైడే (శుక్రవారము) వచ్చింది.
థాంక్స్ గాడ్ ఇత్స్ ఫ్రైడే(ThankGod Its Friday) అనటానికి లేదు. ఈ రోజు మరింత పని, ఒక మీటింగు కూడా ఉంది, వెళ్ళాలి.
హడావిడి మనకు కాని వంటకు కాదు. ఎదో ఒకటి వండాలంటే కుదరదు.
కమ్మగా ఉండాలి, కుడుపు నింపాలి,
రా రమన్ని పిలవాలి, రంగు రంగులుగా ఉండాలి…
రుచి తగ్గరాదు, ఆరోగ్యానికి మేలు నివ్వాలి
ఇన్ని ఎక్కడ దొరుకుతాయిరా శ్రీరంగ నాథా! సంద్య వంటింట్లో తప్ప కావేటిరంగా!!
… ఎదో ఇలా వండి వచ్చింది 20%, ప్రదర్శన 80% తో గుట్టుగా కాలం గడుపుతుంటే శ్రీవారి కోరికలు, చూలింత కోరికలలా…
ఒక్కటే బ్రంచులా తిని పోతానని… కమ్మగా కడుపునింపమని..
ఆచించగా… చించగా బుర్రను
వెలిగింది ఐడియా..
ఉపాయము లేని వాడిని వూర్లోనుంచి తరమాలట..
మరి నాలాంటి వాళ్ళను ఎదురొచ్చి మెచ్చాలోయి..
గబా గబా మా చిన్న అక్షయ పాత్రను(Instant pot) వాడి
వండాను పొంగలి ఉరఫ్ కట్టే పొంగలి.
వడ్డించా సత్యయుగాలనాటి(మొన్నటిది) సాంబారుతో 🙂
అసలు పొంగలి గట్రా వంటివి తింటే వైష్ణవాలయాల్లో, అదీ ధనుర్మాసంలో తినాలండి.
స్వర్గం అడుగు దూరం కాదు, స్వర్గం లోని ఉంటారు.
మా చిన్నప్పుడు నాగరుకర్నూలు లో ఉండేవాళ్లము.
ధనుర్మాసం శ్రీరామాలయంలో బాదం ఆకుల గిన్నెలలో తిన్నవి ఇప్పటికి, ఎప్పటికి మరువలేము.
కానీ ఈ రెసిపీ మాత్రం మా తమిళ మామి చెప్పారు.
వాళ్ళు అహోబిళం జియ్యరు భక్తులు. ఒక సారి ఎదో పూజ కోసం వస్తున్నామని చెప్పారు.
మనం వండితే వాళ్ళకు పనికి రాదు. అందుకే స్వయంపాకం లా అన్ని అందిస్తే, వాళ్ళే వండుతారు. నాకు ఇలాంటివి అభ్యంతరం ఉండదు. వంట వాళ్ళదంటే, ఆస్తి ఇచ్చేస్తాను. ఆస్తి అంటే మళ్ళీ ఎదో మల్టీ ఫ్లెక్స్ ఉందనుకోవద్దు… నాలుగు అంట్లు, మూల చీపురు నా ఆస్తిలా ఈ అట్లాంటాలో లో జీవిస్తున్నానండి.
విషయం కొస్తే, ఒక కప్పు బియ్యం, అదే కొలత పెసరపప్పు ను తీసుకొని, ఒక చెంచా నెయ్యి వేసి, ఉప్పు వేసుకొని, 4 కప్పుల నీళ్లు పోసి మెత్తగా కొద్దిగా జారుగా వండుకోవాలి.
రెండు చెంచాల నెయ్యి వేసి జీరా, మిరియాలు, రెండు పచ్చి మిరప, ఒక రెమ్మ కారియేపాకు, జీడిపప్పు చిటికెడు పసుపు, ఒక ఎండు మిరప వేసి వేయించి, మరో రెండు చెంచాల నెయ్యి వేసి, ఈ తిరగమాతలో ఆ ఉడికిన అన్నం కలపటం.
వేడిగా వడ్డించటం. వండిన ఆహారం మాత్రమే వడ్డించాలి. బిజీ గా ఉన్నామని, మరోటని ఇంకేదో వడ్డిస్తే మరి కష్టపడిన కష్టానికి ఫలితం ఉండదు. అంటే తిను వారు ఉండరు.
అది సంగతి !!
ఇలా ఈ కలి కాలములో ఆహారం వండి వడ్డించబడినది.
కలికాలములో నామ జపము మాత్రమే గతి. అది మరువకు మానవా!!
నేను మానను!!:)
ఽఽ స్వస్తి ఽఽ