ఈ రోజు శీతన వస్తు సముదాయ భద్రతా భరిణ (ఫ్రిజ్)లో చూస్తే చెర్రీ టమోటో లు చాలా వుండిపోయాయి. వాటిని సలాడు లో వాడుదామని తెచ్చాను. నేను రాత్రి పగలు తిన్నా మిగిలిపోయి పాడయిపోతాయని దిగులేసి ఫాస్టుట్రాకు లో వాడటానికి ఏకైక మార్గంగా పచ్చడి లాంటి ఊరగాయ ఒకటి చేశాను.
ఈ రెసిపీ నాకు హైద్రాబాదులో మా వంటమనిషిగారు చెప్పారు. ఆమె అలా చెకచెక చాలానే చెప్పేవారు. అందుకున్నవారికి అందినంత. నాకు తోచినన్ని రాసుకున్నాను. అలా ఈ టమోటో పచ్చడి. చాలా సులువే. నిలువ కూడా వుంటుంది రెండు నెలల వరకూ. సులువుగా వున్న విధానము వలన వండుతుంటే సంతోషము, తినటము మరీ సంతోషముగా వుంటుందనుకోండి.
విధానము:
టమోటోలు పెద్దవి అరడజను, చిన్నవైతే డజను, ఇలా సలాడు వైతే బుట్టెడు కడిగి సిద్దంచేసుకోవాలి.
సన్నగా తరుకొని, బాండిలో కొద్దిగా అంటే ఒక చెంచాడు నూనె వేసి,ఈ తరిగిన టమోటో అందులో వేసి మూత పెట్టాలి. సన్న సెగ మీద దగ్గరకు వచ్చేలా మగ్గనీయ్యాలి. అవి మధ్యలో కలుపుతూ వుంటే అడుగంటదు, మాడదు.
మరో బాణలి లో 2 చెంచాల ఆవాలు, 1 చెంచా మెంతులు డ్రైగా వేయ్యించాలి. వేగిన వీటిని పొడి చేసుకోవాలి. మగ్గి దగ్గరగా వచ్చిన టమోటో కు ఈ ఆవ + మెంతి పొడి, కొద్దిగా పసుపు, 2 చెంచాలు కారము, 1 చెంచా ఉప్పు వేసి కలపాలి. కొద్దిగా ఇంగువ రెండు చెంచాల నూనె లో ఆవాలతో పాటు కలిపి వేయ్యించి ఇందులో కలుపుకోవటమే.
రెండు నెలల వరకూ నిలువ వుంటుంది. వేడి అన్నము కాని, రొట్టె కాని,చపాతీ కానీ, దోశలు, ఇడ్లీలకు కూడా బాగా పనికివస్తుంది. ఇలా చకచకా కానిచ్చి వడ్డించేశాను.
అన్నము పరబ్రహ్మ స్వరూపము. అన్నము తినటమే కాదు వండటము కూడా ఒక తపస్సులా చెయ్యాలని పెద్దలు చెబుతారు. అసలు అన్నము గొప్పతనము చెప్పటానికి ఒక ఉపనిషత్తు వుంది. ఆ ఉపనిషత్తు పూర్తిగా అన్నము గొప్పదనమే చెప్పింది. వండేటప్పుడు మంచి భావాలతో, నామ జపంతో చేస్తే తిన్న వారికి బాగా వంటబడుతుంది. లేకపోతే వారికి కీడు చేస్తుందని కంచి స్వామివారు పరమాచార్య వారు ఉటంకించారు కూడా. అందుకే అన్నము లేదా తినే ఆహారము వండేటప్పట్నించే జాగ్రత్తగా వుండాలి.
అందుకే వంట చేసేటప్పుడు శ్రద్ధతో పాటు, నామ జపమో లేదా నామ సంకీర్తనము వింటూ గాని చెయ్యటము ముదావహం. అంతగా ఏ సంకీర్తనము కుదరకపోతే మనకుందిగా రామనామము. రామ రామ అంటే ఆ రుచి చెప్పనలవికాదని, పాలు, పంచ దార పటికబెల్లం కన్నా కమ్మ నైనదని రామదాసు చెప్పే వున్నాడు.
కనుకు శుభ్రమైన వాతావరణములో , పరిశుభ్రమైన మనసుతో వండే పదార్థపు రుచి తిన్నవారికి, వండినవారికి సంతృప్తినిస్తుంది. రెసిపీ తోపాటు ఆరోగ్యకరమైన జీవితానికి మార్గాలు తోచినవి పంచుకోవటమైనది.
ఽఽఽస్వస్తి. ఽఽఽఽ