యోగులు – పరమాత్మ ప్రతినిధులు
భారతదేశం రత్నగర్భ. ప్రపంచదేశాలు బహిర్ముఖంగా పురోగమిస్తుంటే, భారతదేశ ఋషులు అంతర్ముఖంగా ఆత్మోన్నతి నొంది, ప్రపంచానికి గురువు స్థానంలో దేశాన్ని నిలిపారు.
ద్రష్టలై వారు అందించిన అపూర్వమైన జ్ఞానం, నేడు ప్రపంచానికి పెద్ద వింత.
ఈ దేశంలో సంచరించిన సాధువులు, యోగులు పరమాత్మ ప్రతిరూపులు.
ఒక్కొక్కరి చరిత్ర ఒక జ్ఞానబాంఢాగారం. జిజ్ఞాసువైన సాధకులకు మార్గం చూపటానికి పరమాత్మ ఈ ఋషుల, యోగుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు.
మానవుల యొక్క శ్రద్ధ బట్టి వారికి అటువంటి యోగుల దర్శనం కలుగుతుంది అన్నది నిరూపించబడిన సత్యం.
ఇలాంటి ఎందరో పరమాత్మ స్వరూపాలైన యోగులు కేవలం భక్తులనుద్దరించటానికి ఈ భూమి మీద నడయాడారు.
అలాంటి యోగి పుంగములలో నొకరు మహాత్మ శ్రీ. త్రిలింగస్వామి వారు.
త్రిలింగ స్వామి చరిత్ర గురించిన వివరాలు తక్కువే లభ్యం. తెలిసినంత మటుకు వారి చరిత్ర ఎంతో ఆశ్చర్యం కలిగించక మానదు. ఆయన భూమి మీద నడయాడిన భగవంతుడు.
ఆయన 300 సంవత్సరాలు జీవించినా, అందులో కాశీ లో దాదాపు 150 సంవత్సరములు నివసించినా, ఈ నగ్న స్వామి గురించిన వివరాలు అన్నీ దొరకవు. ఆయన బెంగాలీ భక్తులు రాసిన కొన్ని విషయాలు తప్ప.
ఆ వివరాల బట్టి స్వామి, కరుణ సముద్రుడు. సేవించిన భక్తులను ఉద్దరించాడు.
********
ఆయన తెలుగువాడన్నది మనందరమూ ఎంతో సంతోషపడవలసిన విషయం.
పూర్వం బ్రిటిషువారి పాలన ఉన్న సమయంలో, విజయ నగరం దగ్గరలో ఉన్న ‘హాలియా‘ అన్న గ్రామం లోని నరసింహ ధర, విద్యావతి అన్న బ్రాహ్మణ దంపతులకు 1607 లో జన్మించారు. జన్మ నామం ‘శివరామ‘.
తండ్రి ఆయనకు 9 సంవత్సరముల వయస్సులో ఉపనయనం చేశారు. ఆనాటి నుంచి శివ ఒంటరిగా ఉండటం, ధ్యాన నిమగ్నమై ఉండటం చేసేవాడు.
త్రండ్రి కి రెండవ భార్య ద్వారా మరొక కొడుకు కలిగాడు. తమ్ముని తో అన్యోనముగా ఉన్నా, ఒంటరిగా ఉండటంలో ఎలాంటి మార్పు లేదు.
ఆయనకు చిన్నతన్నానే పెళ్లి చెయ్యాలని తల్లి తండ్రి ప్రయత్నం చేశారు. కానీ శివ వివాహానికి వప్పుకోడు. తనకు వివాహం వద్దని, తమ్మునికి వివాహం చెయ్యమని సలహా ఇస్తాడు శివ.
అలా వివాహం వాయిదా వేసి, ఎల్లప్పుడూ ధ్యానం లో నిమగ్నమయ్యే కొడుకును తల్లి తండ్రులు మరి కదిలించరు. శివకు దాదాపు 40 సంవత్సరముల వయస్సులో తండ్రి మరణిస్తాడు.
ఆనాటికి ఆస్తి చూసుకోవలసిన అవసరం వస్తుంది. శివ ఆస్థిని తమ్మునికి ఇచ్చేసి, కేవలం తల్లి సేవ చేస్తూ ఉండిపోతాడు. ఒక నాడు తల్లి శివ ను చేర పిలచి , ఆమె తండ్రి ద్వారా ఆమెకు లభించిన కాళీ మంత్రం శివకు ఉపదేశిస్తుంది.
ఆమె తండ్రి దీర్ఘ కాలం జీవించాలని కాళీ మాత ఉపాసన చేశాడు. అప్పటికే ఆయన వయస్సు అయిపోవడంతో, కూతురి కడుపునా మళ్ళీ పుట్టి, ఎక్కువ కాలం జీవించే వరం పొందుతాడు. అదే విషయం మరణ సమయంలో కూతురికి చెప్పి మరణిస్తాడు. అలా ఆమె తండ్రే తన కొడుకుగా పుట్టాడని ఆమె అనుకుంటుంది. అదే శివ కు చెప్పి మంత్రం సాధన చెయ్యమని ఉపదేశిస్తుంది.
తల్లి మంత్రోపదేశం చేసిన తరువాత శివ కు మంత్రమే లోకమౌతుంది. ఆయన తల్లి జీవించినంత కాలం ఆమెతోనే ఉంటాడు.
తల్లి మరణించిన తరువాత శ్మశానానికి వెళ్ళినప్పుడు, ఇంక ఇంటికి వెళ్ళటానికి తిరస్కరించి స్మశానంలోనే సాధన మొదలెడతాడు. తమ్ముడు ఆయన కోసం అక్కడే ఒక కుటీరము వేసి, భోజన సదుపాయం ఏర్పాటు చేస్తాడు.
‘కపాల మాలం కరవాల హస్తం
శ్మశాన వాసాం జ్వాలదగ్ని రూపాం
మధ్య ప్రియం భీషణ రక్త జిహ్వము
కాళిం కరాళిం సతతం భజామి “
ఆ శ్మశానం లో 20 సంవత్సరాలు భీకరమైన సాధన చేస్తాడు.
అమ్మవారు ఆయన్ను రకరకాలుగా పరీక్షిస్తుంది. పట్టుదలతో చేసిన సాధన ఫలించి అమ్మవారు చిన్నారి బాలిక రూపములో ప్రత్యక్షమవుతుంది. దేవత
శివను కాశీ లో నివసించమని చెబుతుంది.
భగీరథ స్వామి అన్నే సాధువు అప్పుడే శివ దగ్గరకు వస్తాడు. ఇద్దరు కలిసి రెండు సంవత్సరములు ఆ కుటీరములో ఉంటారు. తరువాత యాత్ర చేస్తూ పుష్కర క్షేత్రానికి వెడతారు. అక్కడ శివరాంకు తన 78 వయస్సులో సన్యాసం ఇవ్వబడుతుంది. సన్యాస దీక్ష ఇచ్చిన తరువాత ఆయనకు ‘గణపతి స్వామి‘ అన్న నామం ఇవ్వబడుతుంది.
తన గురువు పరమపదించిన తరువాత త్రిలింగస్వామి యాత్రలు చేస్తూ రామేశ్వరం చేరుకుంటారు.
రామేశ్వరం లో తన గ్రామ ప్రజలు చూసి, గుర్తు పట్టి ఊరికి రమ్మంటారు. కానీ త్రిలింగస్వామి వినరు. ఇంతలో వారితో వచ్చిన ఒకతను పడిపోయి మరణిస్తాడు. భక్తులు చాల దుఃఖపడి స్వామిని శరణు వేడుతారు. కరుణాసముద్రులైన స్వామి తన కమండలం నుంచి కొన్ని నీళ్ళు చిలకరించి ఆ భక్తుని బ్రతికిస్తారు.
ఆ పనితో భక్తులలో త్రిలింగ స్వామి పేరు మారుమోగిపోతుంది.
భక్తుల తాకిడి తట్టుకోవటానికి ఆయన హిమాలయాలకు వెడతారు.
అక్కడ ఎవ్వరికి కనపడకుండా ధ్యానం లో ఉంటే, నేపాలు రాజు వేటాడుతున్న సింహం దెబ్బ తగిలించుకు, ఈయన ఆశ్రమానికి వస్తుంది. స్వామి దయతో దాన్ని చేరతీస్తారు.
భటులు ఈ విషయం చూసి ఆశ్చర్యపడి రాజు కు చెబుతారు. రాజు కావలసినంత ధనం ఇస్తాను వచ్చి ఆయనతో ఉండమని స్వామిని కోరుకుంటారు. అన్నిటిని తిరస్కరించి స్వామి మానస సరోవరం వైపు వెడతారు.
మానస సరోవరం వద్ద దాదాపు 25 సంవత్సరాలు ధ్యానం లో ఉండి, అక్కడికి వచ్చే భక్తులకు కోరికలు తీరుస్తూ, అక్కడా ఒక చనిపోయిన భక్తుని బ్రతికిస్తారు. దానితో అక్కడ భక్తుల రద్దీ పెరుగుతుంది.
దానితో అక్కడా ఉండకుండా మళ్ళీ దేశాటనము మొదలుపెడతారు.
నర్మదా వడ్డున మునిగిపోతున్న నౌకను రక్షించటం కోసం నదిలోకి వురుకుతారు స్వామి. ఆ సందర్బంలో ఆయన కౌపీనం పోతుంది. ఆ తరువాత ఆయన శరీరానికి బట్ట కట్టరు.
దేశమంతా తిరుగుతూ చివరికి కాశీ వచ్చి ఉండిపోతారు.
కాశీలో దాదాపు 150 సంవత్సరాలు ఉండి, పరమపదంలో కలిసిపోతారు.
కాశీలో త్రిలింగ స్వామి ప్రతి రోజు గంగ లో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి పూజించేవారు. అక్కడ ఆయన మంగళ కాళీని ప్రతిష్టించారు.
ఆయన సేవించిన కాళీ మాత విగ్రహమే శ్రీ సిద్ధేంద్రభారతి స్వామి తపస్సుకి మెచ్చి, భక్తులందరూ చూస్తుండగా ప్రత్యేక్షమైంది. ఆ కాళీ నేటికీ గుంటులో మందిరంలో పూజలందుకుంటున్నది.
త్రిలింగ స్వామి నగ్ననత్వాన్ని బ్రిటిష్ వారికి నచ్చక ఆయన్ని జైలు లో పెట్టమని చెబుతారు మేజిస్ట్రేట్. జైలు లో పెట్టిన వెంటనే స్వామి మాయమౌతాడు. కోర్ట్ లో హాజరు పరవగానే మేజిస్ట్రేట్ స్వామిని అలా తిరగరాదని ఆజ్ఞాపిస్తాడు.
తన తినేదే మేజిస్ట్రేట్ తింటే అలాగే చేస్తా అంటాడు స్వామి. మేజిస్ట్రేట్ సరే అంటాడు. తన మలం చేత పట్టుకు అదే తింటాడు స్వామి. అది రసగుల్లా లా మారిపోయిందని భక్తులు చెబుతారు.
మెజిస్టేట్ మారుమాట్లాడడు.
ఒక భక్తుడు జబ్బుతో స్వామిని శరణు వేడుతాడు. గంగలో బురద తినమని స్వామి ఆజ్ఞాపిస్తాడు. భక్తుడు అలానే చేసి జబ్బు తగ్గించుకుంటాడు.
భక్తుల భక్తి కి కరిగి వారికి కోరిన కోరికలు తీరుస్తూ ఉండేవారు స్వామి. ఆయనను సేవించిన భక్తులకు ఆత్మ దర్శనం కావించారు.
1863 లో రామకృష్ణ పరమహంస కాశీకి వచ్చి విశ్వనాథుని దర్శించుకొని, తరువాత త్రిలింగ స్వామిని దర్శించుకున్నారు. స్వయంగా పాయసం వండి స్వామికి సమర్పించారు పరమహంస.
1869 లో దయానంద సరస్వతి కాశీ లో విగ్రహారాధన వద్దని సభలు నిర్వహిస్తూ ఉంటే, త్రిలింగ స్వామి ఆయనకు ఒక చిట్టి రాసి పంపారు. దానితో దయానంద సరస్వతి కాశీ వదిలి వెళ్లిపోయారు.
గంగా నది దాటటానికి స్వామి ఎప్పుడు పడవ వాడేవారు కారు. నది మీద నడిచి వెళ్లేవారు.
ఆయనతో సంభాషించేందుకు ఎందరో యోగులు ఎక్కడినుంచో వచ్చేవారు. స్వామి అందరి సందేహాలు తీరుస్తూ ఉండేవారు.
స్వామి తన ప్రియ శిష్యునకు అమ్మవారు కాళీ మాత దర్శనం కలిగించారు. స్వామి ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రతేక్ష్యమయ్యేవారు, అలానే మాయమయ్యేవారు.
స్వామి కాళీ మాత ఆజ్ఞ మీద కాశీ లోని కాలభైరవున్ని అనునిత్యం స్త్రోత్రంతో సేవించేవారు.
స్వామి గంగా నదిలో తేలుతూ, మునుగుతూ చాలా సమయం గడిపేవారు. 1887 న యోగముద్రలో కూర్చొని, ప్రాణాలను పరిత్యజించారు.
కాశీ లో పంచ గంగా ఘాట్ లో నేటికీ స్వామి సమాధి మందిరం ఉన్నది.
ఆయన భోధలలో కొన్ని:
– ‘అనవచ్చిన్ననిర్గుణ’ శక్తి నే ఈశ్వరుడు. ఆయనే చైతన్య గుణం.
ఈశ్వర సగుణ రూపం ధ్యానిస్తూ ఉంటే, మనస్సు నిర్మలంగా అవుతూ ఉంటుంది.
ఆత్మ ప్రకాశం అంతరంగంలో పెరుగుతుంది.
అప్పుడు మనస్సు సహాయం లేకుండానే ఈశ్వర అస్తిత్వ అనుభవం పొందవచ్చు.
–గురువు అంటే గతి ప్రదాత, సిద్ధి ప్రదాత. గురువే సర్వం. గురువు ఇచ్చే దీక్ష ద్వారా జీవుడు పరమారాధ్యమైన పరదేవతను దర్శించి కృతార్థుడవుతాడు.
–చిత్త శుద్ధి అన్నది అన్ని మతాలకు పవిత్రమైనది. చిత్తశుద్ధి అంటే ఇంద్రియ సంయమనం, తద్వారా హృదయంలో ప్రశాంతత. దీని వలన ఈశ్వర భక్తి.
– అహింస, భక్తి, ప్రేమ అన్నవి ధర్మానికి మూలం. ప్రేమించే దానిలో మంచి, చెడు చూడకూడదు.
సాధకులు రెండు రకాలు. ఒకరు అన్ని విడిచి అరణ్యాలకు వెళ్ళి సాధన చేసేవారు. కొందరు సమాజం తమదని, ప్రజలను ముక్తి మార్గంలోకి నడిపించేవారు.
– తాను ఒక్కడే అయినా అన్నిటి లోను, అంతర్యామి అయి ఉండి ఏ వస్తువు చేత సృశించబడని వాడు ఈశ్వరుడు.
– ఒక్కొక్క మనిషి ఒక పుస్తకం వంటి వాడు. గర్భవాసం అట్ట,కర్మ ఫలం విషయసూచిక, దీక్ష గ్రహణం విజ్ఞానము. కౌమార్యం, యవ్వనం, వార్దవ్యం అందులో అంశాలు. జీవితంలో మంచి చెడులు పాఠంశ్యాలు.
మహత్ కార్యాలు చేసే వారు భుహత్ కావ్యం వంటి వారు.
వేదాద్యయనం చేసే వారు ధర్మ శాస్త్రం వంటి వారు. అన్ని పుస్తకాలకి సమాప్తం మృత్యువు.
–దేనికి సాటి లేనిది లేదో, దేనిని పొందిన తరువాత పొందవలసినది ఏదీ లేదో అది పరమార్థం. అదే సారవంతమైన వస్తువు. అదే పరమాత్మ.
–ఉపాసన అన్నది ఈశ్వరుని పొందటానికి అవసరం.
– తత్త్వం అంటే ఈశ్వర సంబంధమైన జ్ఞానం. ‘మనమెవరం‘ అన్న విషయం తెలుసుకోవాలి.
ఒక ప్రణాళికతో భక్తి విశ్వాసాలతో సాధన చేస్తే తప్పక ఆత్మదర్శనం కలుగుతుంది. విశుద్ధ చైతన్యమే మనమని తెలుస్తుంది.
ఇలా ఎన్నో బోధలు, ఎందరో శిష్యులకు అందిచారు శ్రీ త్రిలింగ స్వామి.
ఽఽస్వస్తిఽఽ