తపఃసంపన్నులైన యోగులు, సిద్ధ యోగులు, పరమాత్మ ప్రతినిధులు.
భారతావనిలో నడయాడిన ఎందరో మహానుభావులు ఆ నేలను, గాలిని పవిత్రం చేసి, భక్తులను కరుణించి మోక్షమిచ్చారు. నేటికీ ఇస్తున్నారు.
కొందరు సజీవ సమాధి పొంది (జీవించి ఉండగానే సమాధిలో ప్రవేశించటం) భక్తులను అనుగ్రహిస్తున్నారు. సజీవ సమాధి చాలా ప్రత్యేకమైనది. అక్కడ ఆ వాతావరణంలో ఆ యోగిపుంగవుని అపారమైన దివ్య కరుణ ఎల్లరకు అనుభవమౌతూ ఉంటుంది. ఆ పవిత్రమైన సిద్ధ క్షేత్రాలు ఎందరికో ముక్తి మార్గాలు.
అలాంటి మహాయోగులలో సదాశివబ్రహ్మేంద్ర యోగి ఒకరు. అలాంటి క్షేత్రాలలో తమిళనాడు లోని నేరూర్ ఒకటి.
పవిత్ర కావేరి నది వడ్డున, ఆ నేల మీద నడయాడిన ఈ అవధూత, ఈ నాటికీ నేరూర్ లోని సిద్ధ సమాధి పొంది, ఆ అధిష్ఠానం నుంచి భక్తులను కాపాడుతూనే వున్నారు.
************
అంతటి మహాయోగిని కన్న పుణ్య తల్లితండ్రులు అతి నిష్టాగనిష్ఠులు. రామ భక్తులు.
సదాశివ యోగి తండ్రి గారు సోమసుందర అవధాని. గొప్ప తపఃసంపన్నుడు. తేజోమూర్తి. ఆయన వంటి తేజుస్సుతో పిల్లవాడు కావాలని తల్లి పార్వతి కోరుకుంటుంది.
సోమసుందరము గారు పార్వతికి రామ మంత్రము ఉపదేశించి, ఆ మంత్రము సర్వసమయాలలో ఉచ్ఛరించ వలసినదిగా చెబుతాడు.
ఆమె ప్రతికణం రామమంత్రం నిండవలెనని, అందుకు సర్వకాల సర్వావస్థలలో ఆ మంత్రం ఉచ్ఛరించవలెనని చెబుతారు అవధానిగారు. పార్వతి కోట్లు జపించిన తరువాత, ఆమెకు మంత్రసిద్ధి కలుగుతుంది. అటుపైన జన్మించిన పుత్రుడే సదాశివయోగి.
తల్లితండ్రులు ఆయనకు ఇచ్చిన జన్మ నామం శివరామకృష్ణ।
ఏకసంధాగ్రాహి అయిన శివరామకృష్ణ కుంభకోణం వద్దనున్న తిరువైసాల్వురులో రామభద్ర దీక్షితార్ వద్ద వేదాంతం నేర్చుకుంటాడు.
శివరామకృష్ణకు 17 ఏట వివాహం జరిగినా, తన సత్యాన్వేషణలో ఇంటిని వదిలి వెళ్ళిపోతాడు.
తిరువెంకడులోని పరమశివేంద్రసరస్వతి అన్న మహావేదాంతి వద్ద వేదాలు అభ్యసించించి వేదవేదాంగాలలో నిష్ణాతుడవుతాడు.
వేదాంత గోష్ఠిలో, చర్చలలో ఆనందిస్తూ, కాలం గడుపుతున్న శివరామకృష్ణ గురించి గురువు పరమశివేంద్రకు చేరవేస్తారు మిగిలిన శిష్యులు.
గురువు పరమశివేంద్ర , శిష్యుడైన శివరామకృష్ణను పిలిచి, ” ఈ శుష్క వేదాంత చర్చలతో ఫలితమేమి? ఎప్పుడు నీవు మౌనం పాటిస్తావు?” అని కోప్పడుతాడు.
“ఈ క్షణమే” అని సమాధానమిచ్చిన శివరామకృష్ణ నాటి నుంచి మౌనం గా ఉండిపోతాడు.
తదుపరి సన్యాసం తీసుకొని సదాశివ నామంతో ప్రసిద్ధి చెందుతాడు.
మౌనముగా పూర్తి సత్ చిత్ అవస్థలో, అవధూతగా తిరుగాడుతూ ఉంటాడు. సదాశివ యోగిని ఒక్కప్పటి చిన్ననాటి మిత్రుడైన శ్రీధర్ అయ్యవాల్ వచ్చి కలుస్తాడు.
“మౌనం సరే, కనీసం భగవంతుని కీర్తిస్తూ గానం చెయ్యవచ్చు కదా” అని కోరుతాడు.
మిత్రుని కోరికపై సదాశివ యోగి సంస్కృతంలో ఎన్నో కీర్తనలు పలుకుతాడు.ఆయన ఆనాడు పలికిన ఎన్నో సంకీర్తనలలో ‘ పిబరే రామరసం‘, ‘సర్వం బ్రహ్మమయం‘, ‘మానస సంచరరే‘ మొదలైన ఎన్నో ప్రఖ్యాతమైన కీర్తనలు ఉన్నాయి. నేటికీ కచేరీలలో సదాశివయోగి కీర్తన లేకుండా ఉండదని చెప్పటం అతిశయోక్తి కాదు.
‘పిబరే రామ రసం’ అన్న పాట చాలా మంది వినేవుంటారు . చాలా సంవత్సరాలకు పూర్వము ఆ పాట ‘పడమటి సంధ్యారాగం’ లో జంధ్యాల ఉపయోగించారు.
******
విరాగిగా మారి సదా బ్రహ్మైకానందములో నగ్నంగా కావేరి నది వడ్డున తిరుగాడుతూ వుండేవారు. ప్రజలు ఆయనను యోగిగా పూజించేవారు.
కొందరు పిచ్చివాడని తిరస్కరించేవారు. ఇవేమీ సదాశివయోగికి పట్టేవి కావు.
ఒకసారి ఆ రాజ్యం ఏలే నవాబు కావేరి వడ్డున బసచేస్తాడు.
మహ్మదీయ స్త్రీలు పరదా పెట్టుకొని నదిలో జలక్రీడలాడుతూ వుంటారు.
సదాశివ యోగి అటుగా తన పరమానందములో మునిగి నడుస్తూ వెడుతుంటాడు. స్త్రీ లు ఆయనను చూసి కేకలు పెడతారు. పరమానందం లో ఉన్న సదాశివ యోగికి ఇవి ఏమి వినపడవు. ఆయన అలానే వెళ్ళిపోతూ ఉంటాడు.
నవాబు అది చూసి కోపముతో కత్తి దూసి విసురుతాడు. ఆ కత్తి బ్రహ్మేంద్ర యోగి చేతిని ఖండిస్తుంది. ఆయనలో ఏ మార్పు వుండదు. అలానే ఆ సంతోషములో సాగుతూ వుంటాడు. నవాబు ఆయనను మహాపురుషుడని గ్రహించి పరుగున వెళ్ళి మేలు కొల్పుతాడు. యోగి సృహలోకి వచ్చి తెగి వేళ్ళాడుతున్న చేతిని తిరిగి సరిచేసుకొని వెళ్ళిపోతాడు.
విరాగి అయినా ఆ అవధూత దర్శనం నవాబు లో మార్పును తెస్తుంది, నవాబు భక్తుడుగా మారుతాడు.
తొండమాను చక్రవర్తికి దత్తాత్రేయ దీక్ష ఇచ్చినది కూడా సదాశివయోగే. ఇసుకలో మంత్రం రాసి, ఉపదేశం చేస్తాడు సదాశివ యోగి. ఆ ఉపదేశంలో ఇచ్చిన ఇసుకను అలానే తీసుకో పోయి, పూజలో ఉంచుకుంటాడు రాజు.
జలస్తంభన మొదలైన ఎన్నో విద్యలు ఆయనకు తెలుసు. మరొకసారి సదాశివయోగి కావేరి వడ్డున తీవ్ర తపస్సులో వుంటాడు. కావేరికి వరద వచ్చి సదాశివయోగిని ముంచెత్తుతుంది.
కొన్ని నెలల తరువాత నది ఎండి పోతుంది. ఇసుక కోసం పల్లె ప్రజలు త్రవ్వుతూ వుంటే రక్తం రావటము మొదలవుతుంది. భయపడిన ప్రజలు జాగ్రత్తగా త్రవ్వి చూస్తే శివయోగి తపస్సులో వుంటారు. ఆయనను పల్లె ప్రజలు మేలుకొల్పుతారు.
సదాశివ యోగికి పల్లెలోని చదువురాని మూగవాడైన భక్తుడు ఉంటాడు. ఆతను సదా సదాశివయోగిని సేవిస్తూ ఉంటాడు. సదాశివ యోగి దయతో ఆ భక్తుని తలమీద చెయ్యి వేసి నిమురుతాడు. ఆ భక్తుడు మాట్లాడటమే కాక, గొప్ప విద్యావంతునిగా రూపాంతరం చెందుతాడు. అతనే పురాణ రామలింగశాస్త్రి .
పల్లెలోని చిన్నపిల్లలు ఎప్పుడూ సదాశివయోగి చెంత చేరి ఆడుతూ ఉండేవారు. వారిలో ఒక బుడతడు సదాశివయోగి అంటే ఏంతో భక్తి తో ఉండే వాడు. ఆ పిల్లవాని కోరిన కోరికపై వాడికి ఒక్క క్షణంలో వివిధ ప్రదేశాలు చూపించి, మళ్ళీ కావేరి వడ్డుకు తీసుకు వస్తాడు. అదే కోరిక ఒక యువకుడు అడుగుతాడు (సదాశివ యోగిని పరీక్షించే నెపంతో). అతనిని దూరాన ఉన్న క్షేత్రం క్షణ మాత్రంలో తీసుకు పోతాడు సదాశివ యోగి. ఆ యువకుడు కళ్ళు తెరిచి అటుఇటు చూసి, ఆ ప్రదేశం నుంచి ఊరికి కాలినడకన రావలసివస్తుంది.
ఎంతో తపశక్తి సంపన్నులు, కలి యుగములో మన మధ్య నడయాడిన మాహారుషి శ్రీ సదాశివ బ్రహ్మేంద సరస్వతీ యోగి.
తన జీవ సమాధి తరువాత ఒక బిల్వ వృక్షం మొలుస్తుందని, వారణాసి నుంచి ఒక శివలింగం వస్తుందని – ఆ చెట్టు మొదట్లో ప్రతిష్టించమని సదాశివయోగి శిష్యులకు ఆదేశిస్తారు.
నెరూర్లో వైశాఖ శుద్ధ దశమి నాడు జీవసమాధి చెందుతారు సదాశివ యోగి…
ఆయన చెప్పిన తీరున సమాధి నుంచి బిల్వ వృక్షం మొలుస్తుంది. శివలింగం కూడా వారణాసి నుంచి ఒక భక్తుడు తీసుకువస్తాడు. ఆ శివలింగము బిల్వ వృక్షం మొదట్లో ప్రతిష్టించారు శిష్యులు.
ఈనాడు వారి సమాధి గొప్ప తీర్ధరాజంగా విలసిల్లుతోంది. నేటికీ ఆయన సమాధి వద్ద ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి. భక్తులకు కోరిన పద్దతిలో సదాశివయోగి ప్రత్యక్షమై సమస్యలను తీరుస్తూ ఉంటారు.
శృంగేరికి 33 వ శంకరాచార్యులైన సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామి వారు 1902 లో నేరూర్ నందలి సమాధి వద్దకు పిలవబడుతారు.ఆ స్వామి వచ్చి ఆ మందిరంలో మూడు రోజులు నిద్రాహారాదులు మాని ధ్యానం చేస్తారు. మూడోవ నాటికి సదాశివ యోగి వచ్చి ఆ స్వామిని ఆశీర్వదిస్తారు.
శృంగేరి స్వామి సదాశివ బ్రహ్మేంద్ర యోగి పై ‘సదాశివ సత్వం‘, ‘సదాశివ పంచరత్నం‘ అని 45 పల్లవులతో ఒక పద్యం కావ్యం రచించారు. .
మౌనం గా బోధచేసిన సదాశివ యోగి సమాధి మందిరం, బిల్వ వృక్షం నేటికీ భక్తులు దర్శించవచ్చు.
మౌనంగా అక్కడ ప్రార్ధనలు చెయ్యాలి.
ఆ పవిత్ర మౌన వాతావరణంలో కేవలం మౌనంగా చేసే ప్రార్ధనలు విశేష ఫలితాలు ఇస్తాయి.
గాలి గుస గుసలు తప్ప మరొక్క అలికిడి లేని ఆ పవిత్ర పట్టణము భక్తులకు చలివేంద్రంగా నిలిచి మౌనంగా మోక్షమిస్తున్నది.
(Ref : A compilation of the life of Sri Sadasiva Brahmendra – the book by Sivan, ‘Yenipadigalil Manthargal’)