హిట్టా…ఫట్టా…
నవరాత్రులు ముగిసిన ఇన్ని రోజులకు నా నవరాత్రులలో విశేషాలు పంచుకోవాలని అనిపించింది.
నా యోగా క్యాంపు మూలముగా నేను నవరాత్రులలో ఆరాధన షష్ఠి, సప్తమి వరకూ మొదలెట్టలేకపోయా. అందుకే రోజూ ఒక తీపి, ఒక అన్న ప్రసాదము మాత్రమే చెయ్యగలిగాను. లేదంటే రోజూ ఆ వ్రతములో చెప్పిన నైవేద్యము వండుతాను సాధారణముగా.
తీపి ఎప్పుడూ అన్నపరమాన్నమే. అదేమంటే – అమ్మవారు ‘పాయసన్నప్రియే’ కదా! అని సమర్ధన.
నిజానికి నాకు బాగా చెయ్యటము వచ్చినందు వలననో, ఎప్పుడూ చెస్తూ వుండటము వలన బాగా వస్తుందో!! ఇదేదో విత్తు ముందా చెట్టు ముందాలా….
కాని…
నా గుట్టు రట్టుగా మారి, నా నెత్తిన సుత్తిగా, మా వారి చేతిలో మరో పనిముట్టుగా, మారి నన్ను సాధించింది.
నేను ఆవేశపడి, ఆలోచించి, గొట్టపు (youtube)వంటల వీడియోలు చూసి డిసైడు చేషిన.
గోదుమపిండితో హల్వా చెయ్యాలని( ఏ పిండి వాడుతారో పెద్దగా తెలవదు. పిండి అని తెలుసు. అంతే!!)
ఆలోచనేగా జీవితాలను మార్చేది.
మరి ఆలశ్యము అయితే అమ్మ సేవకు లేటు అని చకచకా పిండి తీసి నెయ్యిలో వేయించే ప్రయత్నం చేశాను. అది పూరి పిండిలా మారింది కాని వేగటములేదు. ఒక చెంచా ఉప్మా రవ్వ శరణం. తప్పటము లేదు మరి.
“చూద్దాములే, ఇదేమైనా చంద్రమండలానికి పంపే రాకెట్టా? మరోటా?’ అని నాకు నేను సమాధానము చెప్పుకొని కొద్ది సేపు అలా తిప్పి తిప్పి, చేతులు వంకరలు పోయి, కళ్ళు గిరగిర తిరిగి, నేను తిరిగి పడగలనని గ్రహించి అప్పటికి తిపటము ఆపి, పంచదార కలిపి కొద్దిగా నీరు కలిపి, మళ్ళీ నీరు కలపి….. కొద్దిగా ఫుడ్డు రంగు కూడా కలిపి నానా వేషాలు కలిపి వేసి నెయ్యి రాచిన పళ్ళెంలో వంపాను.
ఆరటానికి సమయం తీసుకుంటోంది.
నేను డ్రామా ఆర్టుసు డైలాగులు రిహార్సలు చేసుకున్నట్లుగా అలా ఇలా పచారులు.
ఇది హిట్టా లేక ఫట్టా అని.
పధార్థము గట్టి పడలేదు.
అసలు మరిచాను
హల్వా గట్టిపడదు మైసురుపాకులా. అహా అయితే హిట్టే….
వెళ్ళి పూజ కానిచ్చి… నివేదన చేశాను. దయగల మా అమ్మ, త్రిపురసుందరి. నివేదన స్వీకరించినది.
నమ్మిన బంటు మొగుడుగారు పెట్టినది తిన్నారు. ముఖమే మూగపోయ్యింది.
నేను పరిక్షాఫలితాలకై ఎదురుచూసే విద్యార్థిని.
‘ఏంటీ చెప్పవు ఎలా వుంది అన్నా’.
కాసేపటికి నోరు తెరచి ‘తియ్యగా’ అన్నారు.
‘పంచదార అంత వేసాక తియ్యగా కాక కారంగానా ఏంటి… మీరు మరీనూ.. ఎగతాళి కాక మరేంటి. సమాధానము విశ్వనాథ మూవిలోలా ఇలా స్లో మోషన్ లో చెప్పాలా”. … అంటూ గుడ్డు వురిమా
“అంటే…. నోరు తెరవలేక పోతున్నా… “
“హన్నా! హస్యం కాకపోతే అంత భయం కూడాను నేనంటే”… మరింత గా కోపం వచ్చింది….. టెన్షన్… ఫలితాలకు మరీ లేటు చెయ్యకూడదండి.
విశ్వసుందరిల పోటిలో చివరకు మిగిలిన నలుగురు ఏకబిగిన వూపిర బిగబట్టి నిలబడ్డట్లుగా…చూస్తూ వింటుంటే..ఇలా పెల్చారు..
“భయమా పాడా… నీ స్వీటు కు నోరు అత్తుకుపోయ్యింది…. మాట్లాడలేకపోతున్నా’…. గ్రురుగా చూస్తూ నిష్క్రమించారు మా వారు…..
ఇంతకీ నా హల్వా హిట్టా ….ఫట్టా……