సంక్రాంతి

సంక్రాంతి  వచ్చింది – వెళ్ళింది. 
మా చిన్నప్పుడు
మేము పెరిగినది టౌనులో. అదీ తెలంగాణాలోని టౌనులో. నీటి ఎద్దడి వుండే వూరది. సంక్రాంతి పండుగంటే మాకు గుర్తుకు వచ్చేది గొబ్బెమ్మలూ, ముగ్గులూనూ. 
గొబ్బెమ్మలు పెట్టడము మేమొక్కరమే ఆ వూరికంతటికీ. ముగ్గులు మాత్రము తెగ వేసేవారు అందరూ. 
ధనుర్మాసము మొదలు, అమ్మ మా చేత గొబ్బెమ్మలు పెట్టించేది. వాటిని అలంకరించటము కోసము మేము తంగేడు పూలు, గుమ్మడి పూలు జమచేసే వారము. తంగేడు పూలు జడలో తురమటానికి బాగోవు. కాని గొబ్బెమ్మలకు బావుండేవి. గుమ్మడి కూడా అంతే. ఆవు పేడతో గొబ్బెమ్మలు చెయ్యటము వలన కాబోలు పేడంటే ఏహ్యభావము వుండేది కాదు. అసలు దేని మీద తేడా భావము లేదు మాకు. సూకరాలు అంటారు చూడండి అలాంటివి వుండేవి కావు. సుకుమారపు వేషాలు లేవు కాబట్టి పనికి జడిసేదేలేదు, నేటి వరకూ. 
అమ్మ మంచి ముగ్గులు పెట్టేది. అక్కయ్య వాళ్ళూ పెద్ద ముగ్గులు పెట్టేవారు, నేను వట్టి రంగులద్దడమే. ఎప్పుడు ముగ్గు వెయ్యాలన్నా ఏవీ గుర్తుకు రావు. కేవలము నాలుగు గొలుసు గీతలు తప్ప.  అలా చిన్నక్క చెయ్యగలిగీ, నే చెయ్యలేనిది ఇదొక్కటే. అయినా కాగితము పై వేసి నేల మీదకు దింపటము వచ్చు. చూడకుండా సొంతంగా రాదని నా బాధ. 
భోగి రోజు ఉదయమే తలంట్లూ, నాన్న కేకల మంగళ ధ్వనులూ వుంటే ‘అదీ పండుగ’ అనిపించేది. గంగిరెద్దుల వారు వచ్చే వారు. వారికి బియ్యం వెయ్యటానికి మేమంటే మేమని అందరమూ తలో గ్లాసు బియ్యం పోసేవారము. మా ఇంట్లో బొమ్మల కొలువూ వుండేది. ఆ హడావిడి అంతా ఇంతా కాదు. వూరంతా వచ్చి చూసి పోయే వారు. అక్కడ బొమ్మలు కూడా మేమొక్కరమే పెట్టేవారము. 

ఇంట్లో బొమ్మలు పెట్టటానికి మెట్లువుండేవి కావు. అమ్మ, నాన్నగారు కలసి టేబులు, చెక్క పెట్టెల వంటివి కలపి ఒక 5 మెట్లు చేసేవారు. అమ్మ వాటి మీద దుప్పటి పరచి, అందంగా వుండటానికితన చీరతో కప్పేసేది. దీనికే చాలా టైంపట్టేసేది. దాదాపు ఒక రోజంతా అన్నమాట. 
ఇక అసలు సరదా బొమ్మలు అమర్చటం అని మా అక్క అభిప్రాయం. మా ఇంట్లో రామ పరివారము, శివుడూ–పార్వతి,

 దుర్గాదేవి ఇలాంటి బొమ్మలు పెట్టెలలోవుండేవి. అవి తీసి జాగ్రత్తగా తుడిచిఅక్క ఆ మెట్లమీద సర్దేది. అవన్నీ మట్టిబొమ్మలు. అందుకని మమ్ములను తాకనిచ్చేవారు కారు. చెయ్యిజార్చి పగల కొడతామని.  కొన్ని కొండపల్లి బొమ్మలు కూడా వుండేవి. తలవూపుతూ వుండే అమ్మాయి బొమ్మ బలేసరదాగా వుండేది. 

ఇవ్వన్నీ అక్కయ్య, అమ్మ కలసి సర్దుతూవుంటే మేము దూరంగా కూర్చొని చూసేవాళ్ళం. 

నాకు మంచి ఫన్ మాత్రం తమ్ముడుతో కలసి మా వూరును రిప్లికా చెయ్యటం . అమ్మ, అక్కయ్య బొమ్మలు పెట్టాక, మేము ఆ వూరు చెయ్యటానికి బయటనుంచి ఇసుక తోడి తెచ్చేవాళ్ళం. రెండు మూడు తట్టలు తెస్తే సరిపోయేది. మా సరదా చూసి పక్కింటి రమా, సూరి కూడా మాతో పాటుతిరిగేవారు మాకు హెల్ప్ చేస్తామంటూ. 
ఆ ఇసుకంతా పరచి, మా వూరు లోవున్న గుట్టమీద వెంకటేశ్వర స్వామి గుడిని తీసుకొచ్చేవాళ్ళం. మా దగ్గర జంతువుల బొమ్మలు చిన్నవి వుండేవి. అందుకని వూరులో లేని ‘జూ’ ని ఇటు పట్టుకొచ్చి పెట్టేవాళ్ళం. మరి స్కూలు తప్పని సరి. ఆసుపత్రి, పోస్టాఫీసు సరేసరి. ఇలా చిన్న చిన్న బోర్డులు చేసి ఇళ్ళ బొమ్మలకు అగ్గిపుల్లతో కాంపౌండు పెట్టి ఈ బోర్డు తగిలించేవాళ్ళం. మా వూరిలో రాజవీధి చాలా విశాలంగా వుండేది. ఆ వీధిని తెచ్చేవాళ్ళం. కానీ రాజకోటకు కావలసిన కోట బొమ్మ లేదు. కాబట్టి దాన్ని వదిలేసేసి వున్నవాటితో  అడ్జస్టు చేసిసర్దేవాళ్ళం. సంతను కూడా అమర్చేవాళ్ళము. 

ఆకుపచ్చరంగుతో వూరు చుట్టూ హరితం అద్దితే అమ్మ నాలుగు రోజుల ముందు మెంతులు చల్లి మొలకెత్తిన మెంతి మడి ఇచ్చేది. ఆ మెంతి మడిని మేము ఒకసారి అడవిగా, ఒక సారివూర్లో అక్కడక్కడా చెట్లగానో ఏర్పాటుచేసేవాళ్ళం. ఒకసారి తమ్ముడు క్రికెట్టుగ్రౌండు పెట్టాడు. అది పెట్టటం కోసం వాడు ఒక సంవత్సరమంతా కష్టపడి ఆచిన్న బొమ్మలు సమకూర్చుకున్నాడు. 
చివరకు వాటికి దీపాల తోరణంఅమర్చేవారు నాన్న. అమ్మ భోగిరోజు ఉదయం బొమ్మలకొలువుకు దీపారాధన చేసి పాయసం నైవేధ్యంగా పెట్టాక, అప్పుడు బయట వారు చూసేందుకు అనుమతి లభించేది. 
ఆ పేరంటము, కుంకుమ, చందనము అద్దటము,పసుపు రాయటం, సెనగలతో వున్న తాంబూలము ఇవ్వటం చేసేవాళ్ళం. మొత్తం 10 రోజులు వుంచేవాళ్ళం. వూర్లో చాలా మంది వచ్చి అడిగి చూసి వెళ్ళేవారు. పిలచినా పిలవకపోయినా వచ్చేసే వారు బొమ్మలకొలువుకు. 

సంక్రాంతి హడావిడి మేము హైద్రాబాదు వచ్చేశాక కూడా సాగింది. ఈ హడావిడికి తోడు జనవరి 12 న మేము దోమలగూడ లోని రామకృష్ణ మఠానికి వెళ్ళేవారము. వివేకానందుని పుట్టిన రోజు వేడుకలకు. 

భోగి నాడు తమ్ముడితో కలసి పతంగులు ఎగరెయ్యటమూ, మంజా దాచుకోవటమూ, హడావిడి. వాడికి హెల్పులా దారము వదలటము, ఒకళ్ళ పతంగు ఒకళ్ళు కట్ చేసుకోవటమూ, యుద్దాలు హోరాహోరిగా సాగేవి. 

సంక్రాంతి పండగ కోసము అమ్మ అరిసెలూ, జంతికలూ చేసేది. కనుము నాడు గారెలు, బయట రథం ముగ్గు తప్పని సరి అయ్యేవి. ఆ రోజులలో తిన్నంత తిండిగా వుండేది. ఇప్పుడు వండటము మనమే, తిండి మనమే అయ్యేసరికే దేని మీద శ్రద్ధ లేకుండా పోయింది. 

మా పెళ్ళి అయిన వెంటనే, పాప. అదీ జనవరి 12 న పుట్టడముతో, మేము దాని పుట్టినరోజు వేడుకలలో మునిగిపోయే వారము. దాంతో మళ్ళీ పండుగ చేసే వోపిక వుండేది కాదు. దాంతో నా సంక్రాంతి పండగ పేరంటాలకూ, బొమ్మలకొలువులు చూడటము వరకే సాగింది. 

ఇప్పుడు సోషల్‌ మీడియాకే పండుగ పరిమితమై పోయింది. ఒకళ్ళకు ఒకరు కేవలము గ్రీటింగ్సు చెప్పుకోవటమే పండుగలా వుంది సుమండీ!! అయినా ఎంతో కొంత నూతనత్వము జీవితములో ఈ పండుగ సంబరాలు తేవాలని కోరుకుందాము. 


Leave a Reply