Airbus – errabus

ప్రయాణములో పదనిసలు 
ఎర్రబస్ఎయిర్‌బస్‌ 

మా చిన్నప్పుడు మేము వుండే
టౌను నుంచి హైద్రాబాదు పోవాలంటే ఎర్రబస్‌ లో వెళ్ళేవారము. బస్సు రావటముతోనే కిటికీలోకి ప్రాకి టవల్ వెయ్యాలి. లేకుంటే సీటు దొరకదు. గొప్పంటే అలా కిటికీ పట్టుకు టవలెయ్యటము. మొనగాడంటే వాడే!!ఎన్టీవోడన్నా, ఏఎన్ఆర్ అన్నా వాడి తరువాతే!!
మా మామయ్య కలకత్తాలో వుండేవాడు. వేసవిలో మామయ్య కొడుకు ఫ్లైట్లో వచ్చేవాడు. మేము అంతా హైద్రాబాదులో కలిసేవాళ్ళము. మాకు విమానమంటే ఆకాశములో చప్పుడు చేస్తూ వెళ్ళే దూరం కొండ. అదో వింత మాకందరికి ఆనాడు. అందుకే మమ్ముల్ని మీరు ఎర్రబస్సు. వాడు ఎయిర్ బస్సు అని వుడికించేవాళ్ళు అమ్మమ్మ ఇంట్లో. 

నేడు విమానము అంటే అందరి అందుబాటులోకి వచ్చింది. దేశంలో ఒకచోట నుంచి మరో చోటకు విమాన
ప్రయాణాలూ పెరిగాయి. టిక్కెటు కూడా చవకగా మారింది. కాని ఇండియాలో విమానాల దగ్గర మా వూరి సంతను మరిపిస్తుంది.  
రెండేళ్ళ క్రిందట రిషీకేష్ నుంచి వస్తున్నా.  ఢిల్లీలో విమానము మారాలి. స్పైసుజట్ వారి విమానము. అందరిని గేటు వద్ద గుమ్మి గూడ్చారు.
గుంపులు గుంపులుగా చుట్టూ బస్సులు.అచ్చంగా  బస్టాండులో మల్లే. అది ఎయిర్‌పోర్టేనా అని సందేహపడేలా…. వున్నాయి  ఎర్ర బస్సులు. (Spicejet uses red color)
బస్సుల మీద కలకత్తా, చెన్నయి, హైద్రాబాదు అని పేర్లు వున్నాయి. అన్నీ ఎర్రబస్సులే. ఒకడు  వూరి పేర్లు అరుస్తున్నాడు. కాకపోతే టై కట్టుకున్నాడు. మా ఎర్ర బస్సు కండెక్టురు డ్రస్సు వేరే రంగులెండి అంతే! అతను ఒక్కో వూరి పేరు అరుస్తూ ఒక్కో గుంపును బక్కో బస్సులోకి ఎక్కిస్తున్నాడు. అంతా మా వూరి  సంతతు మించి జనమూ గోలా.
గోటేటి కనక వుండి వుంటే సంతను మించిన పాట రాసేవారు. 

నేను హైద్రాబాదు రావాలి. నేను ఎక్కిన బస్సు మీద పేరు లేదు. ఇక నాకు కంగారు పట్టుకుంది.  మా సంతలో కూడా నేను తప్పిపోలేదు. సంతలో తప్పేలా వుంది బేరం దేవుడా!!
ఒక విమానమెక్కపోయి మరోటి ఎక్కేస్తానేమో ఖర్మ! దానికి తోడు ఢిల్లీలో సైలెంటు ఎయిర్‌పోర్టని చెవులు వూడేలా అనౌన్స్ చేస్తూ వుంటారు. 
హైద్రాబాదు పోబోయి బెంగుళూరో పోతే నేను ఇంటికి కాదు సత్రానికే పోవాలి. బస్సు దిగాక ఎవరినన్నా అడుగుదామంటే అక్కడి వాళ్ళు గొర్రెలను కంచెలోకి తరిమినట్లు తరమటము. పోనీ విమానమెక్కిన తరువాత ప్రక్క వాడి నడుగుదామంటే అతను ఫోను తీసి అరవంలో మాట్లాడటం మొదలెట్టాడు. నేను చెన్నయి విమానము ఎక్కానని నిర్ణయించేసుకున్నాను. వెనక ముందు అరవమే. నా అనుమానము బలపడింది. లేచి వచ్చేస్తుంటే గగన సుందరి అదే ఎయిర్ హోస్టు అడిగిందిఏంటి అని
నేను హైద్రాబాదు వెళ్ళాలి. పొరపాటున చెన్నయి బస్సెక్కాచెప్పానామెకు. 
ఇది హైద్రాబాదు ఫ్లైట్టేఅన్నది ఆమె. 
అప్పటికి నాకు శాంతి కలిగి కూర్చున్నా. 
అన్నీ విమానాలు ఒకే సమయములో మొదలవుతున్నాయి అక్కడ. అన్నీ స్పైస్‌ జట్ వాళ్ళవే, ఎర్ర బస్సులుఎర్ర విమానాలు.  అన్నింటికీ బస్సులు ఒకే గేటు దగ్గర్నుంచే. మరి ఇలాంటి సంత వేషాలకు కంగారు తప్పదు ఎవ్వరికైనా. అది ఎర్ర బస్ కు ఎయిర్‌బస్‌ కూ తేడా లేదని తెలిసిన క్షణం. ఆనందము కలగదూ మనమే అనుభవమూ కోల్పోలేదంటే..
డిసెంబరులో మేము మా హలీడే కోసమని ఇండోనేషియాలోని బాలీకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాము. మేమిద్దరమూ, అంటే నేనూ శ్రీవారు, వైజాగు నుంచి సింగపూరు ఎయిర్‌లైన్సులో, సింగపూరు మీదుగా బాలి చేరుకోవాలనుకున్నాము. 
మా అమ్మాయి శాన్‌ఫ్రాన్సిసుకో నుంచి బయలుచేరి బాలిలో కలవాలి.
అలాగని ప్లాను చేసుకొని, విమాన టికెట్లు కొనుక్కొని తయారయ్యాము. 
మేమిద్దరమూ మా కారులో హైద్రాబాదు నుంచి పూణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైజాగు చేరాము. నేను వైజాగు వచ్చి గిరిజగారి తో రెండు రోజులు అచ్చికబుచ్చికలాడి, అందరినీ చుట్టబెట్టి, పుస్తకాలు సేకరించుకొని, వేళ్ళే రోజు సాయంత్రానికి శ్రీవారున్న హోటేలుకు చేరాను. అది ఎయిర్ పోర్టుకు ప్రక్కనే వున్న హోటల్ మ్యారియెట్. సరిగ్గా పదంటే పది నిముషాలు విమానశ్రయానికి. 

అంతర్జాతీయ విమానము ఎక్కటానికి మాములుగా నాలుగు గంటలు ముందు విమానాశ్రయం చేరాలి. లగేజ్ మూడు గంటలు ముందు ఇచ్చెయ్యాలి. ఇప్పుడు 24 గంటల పూర్వమే చెక్ ఇన్ అయ్యే అవకాశమున్నందున మూడు గంటల ముందు వెడితే చాలు.  లగేజ్ వెయిట్‌ చూడటము, వాళ్ళకు అప్ప చెప్పటమూ, మనము సెక్యూరిటీ చెక్కు గట్రా కానియ్యటము, ఇమ్మిగ్రేషను లోకి వెళ్ళి మన పాసుపోర్టు మీద ముద్రలు గట్రా వేయ్యించటమూ ….ఇత్యాదివి ఎంత లేదన్నా గంట సమయము తీసుకుంటాయి. తరువాత సామాన్యముగా అంతర్జాతీయ విమానాలకు గంట ముందు, డొమెస్టిక్‌ విమానాలకు అర గంట ముందు బోర్డింగు మొదలెడతారు.  అలా మూడు గంటలూ సరిపోతాయి. అది విమానము సరి అయిన టైం లో నడుస్తుంటే. 

మేము వైజాగులో మొదటిసారి  ఇంటర్‌నెషనల్‌  విమానము అందుకోవటము. మా హోటలులో మేము రెడి అయి, తెలివిగా రాత్రి భోజనమూ కూడా కానిచ్చి బయలు చేరాము. మా విమానము రాత్రి 11 గంటలకు. ఎనిమిదికి మేము విమానాశ్రయం లో వున్నాము. 
మా లగేజ్ ఇద్దరికీ చెరో పెట్ట. ఇది మా హాలీడే ట్రిపు కదా మరి!!
వెళ్ళి లైనులో నిలబడి మా టికెటు చూపించి, లగేజ్‌ ఇచ్చి అరగంట కల్లా మేము సెక్యూరిటికి వెళ్ళటానికి రెడి అయ్యాము. వాళ్ళు ఇమిగ్రేషను తెరవలేదంటూ(?) మమ్ములను అరగంట నిలిపేశారు. అంటే బహుశా విమానాలు రాకపోకలు ఎక్కువగా లేకపోతే ఇలా కౌంటరు మూసుకుంటారు గామోలు. బస్సు రాకపోతే టికెటు కౌంటరు తెరువరుగా అలాసేమ్ టూ సెమ్ ఎర్రబస్సే!!
సరే అన్నీ కానిచ్చి లోపలికెళ్ళాము. గేటు వివరాలు తెలీలేదు. టైం ఇంకా రెండు గంటలు వుంది. లోపల మేముద్దరమూ ,  మరో ఇద్దరు దూరంగా కూర్చొని. నేను కంగారుగా అసలు విమానము వుందా అని అడిగితే వుందని చెబుతారు. కానీ చడీచప్పుడు లేదు. చివరకు దయ గల ఒక ఆఫీసరు పైన రెండు గేటు లుంటాయి, మీ గేటు పైనే వెళ్ళండి అన్నాడు. అసలు వైజాగులో వున్నవి మూడు గేటులు🙂
చివరకు  ఈసురో మంటూ మేమిద్దరమూ పైకి వెళ్ళాము. 
అక్కడ ఒక యాభై మంది వరకూ ప్రయాణికులు అటు ఇటు తిరుగుతూవున్నారు. అదో పెద్దహాలు ఒక వైపు గ్లాసు తలుపు. కుడి వైపు తలుపు ఒక గేటు. ఎడమ వైపు తలుపు మరో గేటు. 
ఆహా!ఇదా రెండు గేటులు సంగతిబాగు బాగు అనుకున్నా. ఇదో ఇంద్రభవనమూ మయసభా బెంగెటుకోవటానికి, మూడు గేటులు రెండు తలుపులు అని ధైర్యం చెప్పుకున్నాము. అయినా నాకు ఎర్రబస్సు అనుభవము వుండనే వుంది. రాత్రి 10.30 అయినా చడీ చప్పుడు లేదు. గేటు దగ్గర 10.40 కి ఇద్దరు సన్నని పిల్లాగాండ్లు వచ్చారు.
నేను వాళ్ళతో మాటలు కదిపే ప్రయత్నం చేశాను. ‘ఏంటి బాబు విమానము పరిస్థితిఅని! 
వస్తుంది…. మీరు వెడతారు…’ అని పాట పాడాడతను. 
లైటైయినట్లుగా వుందికూపీ తీసే ప్రయత్నం నాది. అప్పటికి 10.45 అయ్యింది మరి.. 
ఏమీ కాదు. సరి అయిన టైం కే బయలుచేరుతుందిఅన్నాడొకడు. 
విమానము వచ్చిందా?’ అడిగా నేను. 
రేడార్లో కూడా కనపడటం లేదింకాఅన్నాడొకడు. 
ఓహో గంట లేటు అంటే!’ అన్నా నేను. 
కాదండి. మా రికార్డు. లేటు వుండదు ఫ్లైటుఅన్నాడు. 
వాళ్ళిచ్చిన టైంకి ఇంకా పావు గంటే వుంది. ఇంకా ఫ్లైటు రాలేదు. 
వచ్చాక అందులోని వాళ్ళని దింపాలి. క్లీనింగు గట్రా చెసి వీళ్ళని ఎక్కించాలి. ఎంత కాదన్నా 40 నిముషాలు పడుతుంది. 
ఏంటి బక్కోడి ధైర్యం???‘ అనుకున్నా. 
మళ్ళీ వూరుకోకుండా 
మీకెలా తెలుస్తుంది విమానమోస్తే?’ అని అడిగాను. వాళ్ళ దగ్గర వాకీటాకీ లు లేకపోవటం చూసి. 
మాకు వాట్సఫ్ గ్రూపు వుంది. అందులో మెసేజ్ పెడతారు. అప్పుడు మిమ్ములను పంపుతాముఅన్నాడు వాడు. తెల్లబోయాను. ఇదేమన్నా వంటా వార్పా. వాటస్పు గ్రూపేమిటి? మెసేజ్ చూసి తోలటమేంటి అసలు? 
ఎర్రబస్సు కన్నా అడ్వాన్సు ఇదేమరి!!
10.50 కి అరిచాడు అందరిని రమ్మని. మన దేశీలు అలవాటుగా గుంపుగా పడ్డారు అతని మీద. అతను అందరిని కలిసికట్టుగా లోపలికి తోసేస్తున్నాడు. నెత్తిన కత్తి పెట్టినా అంత ఫాస్టుగా పనిచెయ్యరెవరు. అతని వేగం ముచ్చటగా వుంది. నన్ను మురవటానికి వీలు లేకుండా లోపలకు తోపు తోశారు మేము చివరన తోయ్యబడ్డాము.   తలుపులోంచి క్రిందకు, అటుగా విమానములోకి. 
తిరుపతి వెంకన్న ముందు వీళ్ళనుంచితే తోపులో పస్టు వస్తారు. అలా తోస్తున్నారు లోపలకు. 
కరెక్టుగా 11 గంటలకు అందరినీ లోపలికి తోపు తోసి తలుపేసేశారు. చేతులు దులుపుతున్నారు. 
11.05 కి విమానము గాల్లోకి లేచ్చింది. 
ఇది ఎయిర్ బస్సా??? ఎర్ర‌బస్సా?????
రెంటికీ తేడా వుందా?

ఇదర్‌ సబ్‌ కుచ్‌ హోజాయెగా!! 
మేరా భారత్ మహాన్‌!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s