కుడి ఎడమైతే-1
ఈ కధ ఇరవై సంవత్సరాల క్రిందటిది. ఈ రోజుల్లా లేవు అప్పుడు. అమెరికా అంటే పిచ్చి పీక్ లో వున్నప్పటి సంగతన్నమాట, ఈ కధాకాలము. ఇంటరునెట్ అప్పుడప్పుడే మొదలైన కాలము. గూగులమ్మ ప్రపంచ పఠమును సిద్ధం చెయ్యని కాలము, అలా అంటే అదేదో రాతి యుగము కాదు గాని మొబైలు ఫోను లేని కాలము. ఇంకా ఉత్తరాలు గట్రా రాసుకుంటున్నారు జనాలు. అప్పటి సమయము ఇది. ఆ సమయములో మేము ఈ అమెరికా ఖండం మీద, న్యూయార్కు ఎయిర్ పోర్టులో కాలుమోపాము. మేము వచ్చింది చిక్కటి చలికాలము.
జనవరి చలి బిగదీసింది గాలిని. బయటంతా మంచు పల్చగా పరుచుకుంది. మేము ఆ ఎయిర్‌పోర్టులోకి పైకి కిందకీ, కిందకీ పైకి పరాపరా నాలుగు సార్లు తిరిగి, మమ్ములను అడ్డుకునే వారు లేరని గ్రహించి ‘యురేకా’ అని అరచి, చతికిలపడి లేచి బయటకూ, డొమెస్టిక్ టెర్మినల్ లోకి తిరిగి, మేము తరువాత ఎక్కవలసిన డొమెస్టిక్
విమానము వివరాలుచూసుకున్నాము. మేము అప్పుడు అట్లాంటా వెళ్ళాలన్న మాట.
అట్లాంటా చెరేసరికి చిమ్మచీకటితో కూడిన రాత్రి. దానికి తోడు వాన. మాకా మొదటి సారి అలా పెట్టేబేడలతో పిల్లాపాపలతో అత్యంత ఆధునికమైన విచిత్రపోకడల దేశములో( అలాగే చెప్పేవారుగా టీవిలలో) కాలుమోపామన్నమాట.
మేము మా బట్టలు, కొన్ని పుస్తకాలు, వంట గిన్నెలు, నా దేవతారాధనతో మాత్రమే అట్లాంటా చేరాము. మేము వచ్చింది యూరప్‌లోని సైప్రస్ నుంచి. అందుచేత మా దగ్గర పచ్చళ్ళు, అంటే వూరగాయలు, తినుబండారాల వంటివి లేవు. ఇండియా నుంచైతే మేము బారిస్టరు పార్వతీశం లా ఉప్పుకల్లు, ఆవకాయలతో సహా సర్వంతో వచ్చేవారము. అలా కాదంటే మా అమ్మ వెళ్ళనిచ్చేది కాదు. మేము అమ్మ వున్నప్పట్టి రోజులలో వట్టి చేతులతో వచ్చిన సందర్భము భూతద్దములో వెతికినా దొరకదు. తరువాత మా బాగోగులు పట్టించుకునే వారి కోసము మాంత్రికుని మాయ దర్పణములో చూసినా కనపడరను కోండి. అదే అమ్మంటేనూ, పుట్టిలంటేనూ….అది మరో విషయమనుకోండి.
ఇంతకీ చెప్పొచ్చేదేమంటే, అలా బట్టలూ పాత్రలతో అమెరికా దేశ ప్రవేశము చేశామా, వేల మైళ్ళు ఇరువై గంటలు ప్రయాణించామా..మాకు అంత వరకూ ఎలాంటి ఇబ్బంది లేదు . ఇంక ఇక్కడ స్థిరపడాలిగా, అలా చెయ్యాలంటే సోషల్ సెక్యూరీటికి ముందు అప్లై చేయ్యాలి. చెయ్యాలంటే ఆ ఆఫీసుకు వెళ్ళాలిగా… వెళ్ళాలంటే కారు తోలాలిగా… అదిగో అక్కడ మొదలయ్యింది మా వారికి తకిటతదిమి. నాకు సరిగమపదనిస. అంటే నా పాటలూ ఆయన ఆటలన్న మాట కాదు… అనగా నేను అరుచును వారు నడుచును. అర్ధం చేసుకోండీ…
మేము మొట్ట మొదట ఓం ప్రధమములో కారు నేర్చుకున్నది, స్టీరింగుపై కాలు, గేరుపై చెయ్యి…అటుదిటుగా అదీ హైద్రాబాదులో. తరువాత మేము వున్నదీ, సొంత కారు లాఘవముగా డ్రైవు చేసినదీ సైప్రసులో. అన్ని చోట్ల రోడ్డుకు ఎడమవైపుగా తోలేవాళ్ళము. ఇక్కడ పద్ధతి తిరగమరగ. కుడి ఎడమే, వఎడమ కుడే… అటుదిటే, ఇటుదటే… అంతా అయొమయము, గందరగోళమే.
కుడి ఎడమైతే పొరపాటు లేదని ఎవరు చెప్పారో కాని శుద్ధ అబద్ధమండీ. అటుదిటుగా మారితే మన గతి అధోగతే, విన్నారా.
కారు నేర్చుకునేటప్పుడు మెదడు మనమిచ్చే ఆదేశాలు అందుకొని, జాగ్రత్తగా వింటూ పాటిస్తుంది. కానీ అదే రోజూ చేస్తూ వుంటే, అలవాటుగా మారి అటోమేషన్ మొదలెడుతుంది కదా మనకు టెస్టింగులోలా. కాబట్టే కుడి ఎడమైతే పోరపాటూ అంతా ఇంతా కాదు….
కారు టాపు లేచును, మనకు మొఖము పగులును…
ఎడమ వైపు నుంచి కుడి వైపుకు కారు నడపమూ, రోడ్డు మీద, సందులలో తిరిగేటప్పుడూ తప్పు వైపుకు వెళ్ళిపోవటమూ, కార్లకు అడ్డంగా కొట్టుకు పోవటము అసలు ఒకటేమిటి, ఏదేదో అయిపోయాయి. అసలు మా మొఖాలు కారు నడిపినవేనా అన్న అనుమానము వస్తుంది మమ్ముల్ని ఎవరన్నా గమనిస్తే. అంతగా కంగారు పడ్డాము కారు నడపటానికి ప్రధమములో.
ఇక హైవే కధలు మరోలా వుండేవి. హైవే మీదికి వెళ్ళాలంటే ఎందుకో భయం. మా వారికి కాళ్ళు గజగజా. ఆ గజగజలలో గజం అటు పోతే ఏకాఏకి కైలాసమే సందర్శనము.
ఆ వేగమూ, ఆ గీతలలో పోవటమూ అన్నీ వింతే. అంతకు పూర్వం అక్కడ హైవేలు వున్నా కూడా ఇక్కడి కన్నా అక్కడ కార్లు తక్కువగా వుండటమో వలనో మరోటో ఇలా వుండేది కాదు. ఇన్ని గీతలూ ఇంత రణము లేదు. దానితో ఒకటే కంగారు…కంగారే కంగారు.
మా శ్రీవారు కంగారు పుట్టి తరువాత ఈయన పుట్టాడనుకుంటా. ప్రతీదానికీ భయపడేవాడు. అలానే వణుకుతూ కారు తోలటము. నా కేకలు, మా అమ్మాయి ఏడుపు గాజరగీజర కలగూరకంప అంతా. మేము అలా వూరేగింపపగా సోషల్ సెక్యారిటీ ఆఫీసుకు బయలు చేరాము వచ్చిన రెండోనాడు. హైవే ఎక్కకూడదని ఆయన భీష్మించుకోవటమూ… మేము దారి తప్పి, మ్యాపు చూడటము రాక వూరవతలకు వెళ్ళిపోయాము. పొలాలు వచ్చేశాయి.
‘దారి తప్పాముగా మిత్రమా!’అని అరిచాను. కంగారుగా .కంగారు పడి ఆయన, పెట్రోలు బంకోళ్ళని బ్రతిమిలాడి మేప్ లో చూపించుకొని పరుగున వచ్చాడు. మేము మళ్ళీ రోడ్డున పడ్డాము. అప్పుడు జిపియస్ లేదు. చెప్పాగా రాతి యుగానికి తమ్ముడి యుగమని. మ్యాపులో చూసుకుంటూ రోడ్లు కొలుచుకుంటూ వెళ్ళాలి. అలా మొత్తానికి ఆ ఆఫీసు వాడిని కనుగొని, మా వివరాలు ఇచ్చి వచ్చాము. అలా చేసేసరికే మా పెద్దలు కనిపించారు. అలా మేము వచ్చిన మొదటి వారములో కారుతో చేసిన ఎడమ కుడిల ఘనకార్యమన్నమాట…