టికెట్ల -ఇక్కట్లు:
అమెరికాలో కారు నడపటానికి లైసెన్స్ వస్తే సరిపోదు, మనము ఆ లైసెన్స్ ను కొంత సెన్స్ తో కాపాడుకోవాలి. అంటే ఇక్కడ పాంయిట్ల పద్దతిలో మనకు వివిధ సందర్భాలలో ఫైనులు – పాయింట్లు పడి లైసెన్స్ ఊడవచ్చు. మనకు కృష్ణ జన్మస్థానము వెళ్ళె అవకాశము కలగలవచ్చు. దానికి ఎన్నో అవకాశాలున్నాయి. అందులో ముఖ్యమైనది వేగంగా వెళ్ళటము.
ఇక్కడ రోడ్లు నున్నగా వుంటాయి. ట్రాఫిక్కా తక్కువగా వుంటుంది. మరి మనము వారు చెప్పిన వేగములో వెళ్ళాలంటే ఎంత నిగ్రహము వుండాలి?
మనకు నిగ్రహము వున్నా, గ్రహాల అనుగ్రహము లేకపోతే దొరికిపోతాము. కాపులు(cops) ఎక్కడ కాపుంటారో తెలియదు. కొన్ని సార్లు కౌంటీకి డబ్బు ఇకట్లు వస్తే, ఈ వీరులందరూ వీధులపై మీద పడి, ఐదు మైళ్ళ వేగం పెంచినా పట్టుకొని ఫైను ప్రేమగా అందించిన సందర్భాలు వున్నాయి. అదే సుడి బావుంటే మనము 25 మైళ్ళు వేగము పెంచి (స్పీడు లిమిట్ పై) వెళ్ళినా పట్టుకోరు. పట్టుకున్నా వార్నింగు ఇచ్చి వదిలేస్తారు. కర్ణుడి చావుకు కారణాలు లక్షలా ఈ కాపుల ప్రవర్తనకు కారణాలు లక్ష. బహుశా వారు ఆ రోజు తిన్నారో లేదో, లేదా నాలాంటి గయ్యాళి పెళ్ళాం దొరికిందో, లేక దేశీగాళ్ళకు బెంజు కారెందుకు అన్న కుళ్ళో…ఏదో చెప్పలేని బాధో…అలా వుంటాయన్నమాట. కాని ఏ మాటకామాటే చెప్పాలి, ఇక్కడ కొన్ని రోడ్లు వుంటాయసలు, విశ్వామిత్రుడు మేనకను చూసి ‘ప్చ్” అనవచ్చేమోకాని స్పీడుగా వెళ్ళకుండా ఎలా వుండగలము? అని అనిపిస్తాయి. ఆ కారును, రోడ్డును, మనము స్లోగా వెళ్ళి ఎలా అవమానపరుస్తాము? కాబట్టి టికెట్లు వస్తాయి. చూసిచూడనట్లుగా వుండాలి. కాని మావారున్నారు…. నా స్పీడుకు, టికెట్లకు, ఇన్సురెన్సుకు లంకే వేసి చావగొడతాడు. ఆయన తోలుతాడు చూడండి, ఎద్దుల బండి వేగంగా వెడుతుంది ఈయన కారు కన్నాను. ఏమి చెప్పాలి చెప్పండి. నా స్పీడు ఈయన నత్త నడకలకు జత కుదరక, కుదిరిన జతలో ఇమడక మేము ఎప్పుడు ఎటు వెళ్ళినా ‘ఓహో! రామరావణ యుద్ధమే!!’
చేసుకున్న వారికి చేసుకున్నంత.
టికెట్లు పాయింట్లు కదా మన టాపిక్. అందులో చాలా సందర్భాలున్నాయి. కొన్ని పంచుకుంటాను.
నాకు మొదటి టిక్కెటు మా పిల్లను డ్యాన్సు క్లాసుకు తీసుకుపోతుంటే వచ్చింది. లేటైయ్యిందని, నేను 45 వున్న చోట 50 లోనో 55 లోనో వెడుతున్నాను. పట్టేశాడు. వేగంగానే కాకుండా యల్లో లో ట్రాఫిక్ లైటు దాటానని. నేను ‘డాన్సు క్లాసు లేటైయ్యిందని’ అంటూ నసిగాను. అతను ‘మీరు క్షేమంగా వెళ్ళండి. వేగము కాదు. అయినా యల్లో లో దాటుతారా’ అన్నాడు.
‘ఎల్లో అంటే ఏల్లెహే’ అని కదా నా బాషలో అనుకున్నా. అతనితో అనలేదనుకొండి. మరో టికెటు ఇస్తాడని.
అప్పుడు శ్రీవారెమనలేదు కాని అపార్టుమెంటు మిత్రులు మాత్రం, ‘పోలీసు ఆపితే నేచర్ కాల్, అనాలి. టికెటు ఇవ్వడు’ అని సలహాలు ఇచ్చారు.
ఒకసారి మేము ఫ్లోరిడా వెళ్ళాము. మా కారులోనే. మా అమ్మాయి, దానితో దాని ఫ్రెండును తీసుకొని. ఇద్దరూ అప్పుడు ఆరవ తరగతనుకుంటూ. మేము ‘కీవెస్టు’ వరకూ నడపాలని అనుకున్నాము. మయామి నుంచి ‘కీవెస్టు’ కి రోడ్డు తప్పక నడప వలసిన రహదారులలో ఒకటి. చాలా బాగము సముద్రం పై వుంటుంది. ఒక లైను అటు ఒకటి ఇటు. పాసింగు, అంటే ముందు కారు దాటటానికి కుదరదు. రోడ్డు చాలా బావుంటుంది. అందుచేత దానిపై వెళ్ళాలనుకున్నాము.
వెళ్ళేటప్పుడు తను నడిపారు. అక్కడ రెండు రోజులు గడిపి మళ్ళీ మయామికి బయలుచేరాము. వెనక్కు వచ్చేటప్పుడు నాకు చాన్సు వచ్చింది. 45 మైళ్ళ స్పీడు లిమిట్ ఎవ్వడు పెట్టాడో కాని వాడిని కోసెయ్యాలి. అంత శాడిజమా మరీ. దానికి తోడు నా ముందు ఒక ఎద్దుల బండి తోలేవాడు. పోడే అసలు. మావారికి అన్నలు తమ్ములే ప్రపంచమంతానూ.
నేను గంట సేపు టిక్కు టిక్తు మంటూ వాడి వెనక వచ్చాను, చచ్చినట్లు. మరి మరో మార్గం లేదుగా. ఒకచోట కొద్దిగా సైడుకు గ్యాపు వచ్చింది. రాంగు అయినా ఓపిక నశించి బండిని సైడు నుంచి లాగించేశాను. పిల్లలు బేరు మంటున్నా వినకుండా.
నా కర్మకు ఆ ప్రక్కనే వున్నాడో కాపు. వెంటనే వాడి నెత్తిన వున్న లైట్లు వేసుకు వెనకే వచ్చాడు.
‘చచ్చాననుకొని’ ఆగాను ప్రక్కకు తీసి.
నా లైసన్సు గట్రా అడిగాడు. చూపించాను.
ఏంటి ఆ దూకుడు అన్నాడు.
వెనకకు చూపి ‘పిల్లలకు అర్జంటు’ అన్నా,
‘దగ్గరలో ఎక్కడుంది’ అని వాడినే అడిగా.
‘ఒక మైలు వెళ్ళు ‘ అన్నాడు వెనకకు చూస్తూ. ఇద్దరు పిల్లలు దిబ్బ మోహాలతో భయంగా కూర్చున్నారు.
‘వేగంగా వెళ్ళకు’ అని నా లైసెన్సు ఇచ్చేశాడు. టికెటు ఇవ్వలేదు.
మేము ఒక మైలు లో వున్న రెస్టుఏరియాకు వెళ్ళాము. మా వెనకే వచ్చాడు.
మేము ఆగి మళ్ళీ డ్రైవింగు మారి బయలుచేరాము. శ్రీవారు అప్పటికే సహస్రం తిట్లు ఆపాడు. నేను టికెట్ రాలేదు. ట్రిక్కు పనిచేసింది. ఇంకా అంటే వాడిని పిల్చి చెప్పేస్తా’ అని బెదిరించినా ఫలితం లేకపోయింది. ఇక ఇంటి దాకా ఎద్దుల బండిలో వచ్చాము.
అలా జరిగింది!!