భగవాను అడుగుజాడలలో

మంచి పుస్తకాలు చాలా అరుదుగా దొరుకుతాయి. అవి దొరికినప్పుడు, వాటిని చదివాక  గొప్ప సంతోషం కలుగుతుంది. అది మనకు భగవద్గీతలా దారి చూపేదైతే, ఆ రసానందం గురించి ఇక చెప్పనక్కర్లేదు కదా!!
అలాంటి గ్రంధం గురించే ఈ వ్యాసం. ఈ పుస్తకం ప్రతి సాధకుడూ చదవవలసినది. ప్రతి ఉపాసకుడూ చదవవలసినది. ప్రతి అద్వైతి కూడా తప్పక చదవవలసినది. ప్రతి మానవుడూ కూడా తప్పక చదవవలసినది. 

ఆ గ్రంధం  “Living by the words of Bhagawan” అన్న ఆంగ్ల గ్రంధానికి తెలుగు అనువాదం “భగవాన్ అడుగుజాడలలో…అన్నమలై స్వామి జీవితం”.

రమణాశ్రమం వారి పుస్తకదుఖాణంలో దొరుకుతుంది.  ఎవరీ అణ్ణామలై అని అనుకోవచ్చు.  వీరి గొప్పతనమేమి అనికూడా మీకు సందేహం కలగవచ్చు.

చిన్నతనన్నే జీవిత పరమార్థం తెలుసుకోవాలని తపించిన ఒక తమిళ యువకుడు అణ్ణామలై. ఆయన తమిళనాడులోని తొండస్కురిచ్చి అన్న చిన్న ఊర్లో జన్మించారు.  చిన్నప్పుడు జాతకం చూపించిన తల్లితండ్రులకు వీరు సన్యాసి అవుతాడని చెప్పారుట. దాంతో ఈయన్ని చదువుకు కూడా దూరం చేసి పనిలో పెట్టారు తండ్రి. 
కాని చిన్నతన్నము నుంచి పూర్వజన్న సుకృతం వలన పరమాత్మ వైపు హృదయం లాగి దైవ చింతన, భజనలు వంటివి చేస్తూ ఉండేవారు. కంచి స్వామి మహాపెరియవా దర్శనం కలుగుతుంది. 
“శివాయనమః” అనుకోమని చెబుతారు మహాస్వామి. ఆ చింతన రమణుల వైపుకు లాగుతుంది.  అలా ఆయన రమణాశ్రయం వైపు కదులుతారు. 
రమణభగనాన్ను కలిన మొదటి క్షణంలో వీరితో భగవాను “నీ కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎప్పుడు వస్తావా అనుకుంటున్నా” అంటారు. 
“ఆత్మసాక్షాత్కారం పొందటమెలా?” అని వీరు భగవాన్ను అడుగుతారు. 
“నీవు ఇప్పటికే ఆత్మస్వరూపానివి. నువ్వు ఈ శరీరమన్న భావన వదిలి ఆత్మ మీద ధ్యానం చేస్తే ఆత్మసాక్షాత్కారం జరుగుతుంది” అని  చెబుతారు భగవాను. 
రమణాశ్రమంలో పని కొరకు చూస్తే భగవాను సహాయకులుగా పని దొరుకుతుంది. 
అలా వీరికి భగవానుతో అత్యంత సన్నిహితంగా ఉండే అవకాశం లభిస్తుంది. 
ఒకసారి వీరు భగవానుతో “ఆకాశమార్గాన అతి వేగంగా ప్రయాణించే విమానాలు తయారు చేశారు శాస్త్రజ్ఞలు. ఈ సంసారసాగరాన్ని దాటేందుకు అలాంటి ఆధ్యాత్మిక విమానం మీరు తయారు చేసి మాకివ్వకూడదా?” అని అడుగుతారు. 
“నీకు అవసరమైన విమానం ఆత్మవిచారమే. సులభంగా, సూటిగా, వేగంగా గమ్యాన్ని చేర్చేది ఈ మార్గమే”అని చెబుతారు భగవాన్. 
నేను ఉన్నాను, నేను తిన్నాను, నేను చూశాను ఇలా అన్నింటా ఉన్న “నేను” అన్న భావాన్ని పట్టుకు ఆలోచనలను వెనకకు త్రిప్పితే అది అన్నింటికీ మూలమైన ఆత్మ వద్దకు చేరుస్తుందని చెబుతారు. 
సాధకులుగా మనం భగవాన్ చెప్పినది చెయ్యటమే మన కర్తవ్యం అని చెబుతారు అణ్ణామలై. 
వీరు ఆశ్రమంలో జరిగిన అన్ని కట్టడాలనూ దగ్గరుండి నిర్మించారు. భగవాన్‌ వీరికి ఆశ్రమ నిర్మాణం పని అప్పచెప్పారు. 
ఈ స్వామి ఆ పనిని ఎంతో భక్తిగా, సమర్ధవంతంగా పూర్తి చేశారు.  ఇన్ని పనుల మధ్య ఈయనకు భగవానుతో ఎంతో సన్నిహితంగా తిరిగే అవకాశమొచ్చింది. వీరు దానిని ఎంతో చక్కగా వినియోగించుకున్నారు కూడా. సేవగా భగవాను చెప్పిన పనులు చేస్తూ, అయనతో సన్నిహితంగా మెలుగుతూ ఆత్మవిచారం వైపుగా సాధన చేసారు. 
భగవాను చెప్పిన ఎన్నో ఆణిముత్యాల వంటి మాటలు మనకు వీరి ద్వారా లభ్యమైనాయి. 
ప్రతి బోధతో భగవాను ఒక పద్యానో, ఒక శ్లోకాన్నో ఉదహరించేవారుట . పుస్తకాల గురించి చెబుతూ సాధకులు తప్పక చదవవలసినవిగా భగవాను సూచించినవి : కైవల్యనవనీతం, రిభుగీత, అష్టావక్రగీత, ఎల్లాం ఒన్రే, స్వస్వరూపసారం, యోగవాసిష్ఠం. 

ఈ ప్రపంచం ఒక పెద్ద నాటకరంగం. మనం మన పాత్ర నిర్వచించటానికి వచ్చాము. భేదాలు వ్యత్యాసాలు ప్రకృతి ధర్మం. మన హృదయంలో భేదభావం ఉంచుకోకపోతే మంచిది.  అద్వైతం మంచిదే కాని అది గురువుల వద్ద ప్రదర్శించకూడదు.

 
భగవాన్ గిరి ప్రదక్షిణ గురించి ఎంతో ప్రముఖంగా చెప్పేవారు. 
అన్నామలైకి కూడా గిరిప్రదక్షిణ చెయ్యాలని ఉండేది కాని ఆయన కట్టడం పనులలో మునిగి చెయ్యలేకపోయేవారు. ఒకసారి ఎలాగైనా చెయ్యాలని పూనుకొని భగవానును అనుమతికోరుతారు. 

 “నీ పని నీవు సమర్ధవంతంగా చెయ్యు. అదే గిరివలయంతో సమానం”అని భగవాను చెప్పినా తనకు కలిగిన ఈ కోరిక తీర్చుకోవాలని అనుకుంటారు అన్నామలై. 
ఆయనను వెళ్ళమని అనుమతినిస్తారు భగవాను.  గిరివలయం చేసి వచ్చేసరికే భగవాను ఎండలో నిల్చొని కట్టడం పనులను చూసుకుంటూ ఉంటారు. వచ్చిన భక్తులు భగవాను దర్శనం అక్కడే చేసుకుంటూ ఉంటారు. అన్నామలైకు చాలా అపరాధభావం కలుగుతుంది. 
ఆ తరువాత ఆయన భగవాను చెప్పిన ఏ పనినైనా తూఛా తప్పక పాటించారు. 

ఆశ్రమంలో సర్వాధికారిగా నిరంజనాస్వామిది చాలా నిరంకుశపు పోకడగా ఉండేది. ఎందరో ఆయనతో విసిగి భగవానుకు చెప్పే ప్రయత్నం చేసేవారు. భగవానుకు ఇలాంటివి నచ్చేవి కావు. ఆయన విని మానంగా ఉండేవారు.  ఒక సన్నిహిత భక్తుడు అడిగిన మీదట “నిన్ను నీవు దిద్దుకుంటే ప్రపంచాన్ని దిద్దుకున్నట్లే” అన్ని చెబుతారు భగవాను.
ఇది చూసి అన్నామలై ఆయనకు ఎప్పుడూ ఏ విషయం గురించి చెప్పలేదు. నిరంజానాస్వామి చేసిన ఎన్నో ఆగడాలను మౌనంగా సహించారు.
ఒక భక్తుడు “భగవాను పాదాలు పట్టుకోవచ్చా“ అని అడిగితే 

“నిజభక్తునికి గురుపాదాలు హృదయంలో ఉంటాయని” సమాధానం చెబుతారు భగవాన్.  

గురువుకు సన్నిహితంగా ఉండాలని, తాను చేసే సేవలు ఆయన గమనించుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. తాము చేసే చిన్న పనుల నుంచి పెద్దవాటి వరకూ ఆయనకు తెలిసేలా చేస్తూ ఉంటారు. అలా ఆయన దృష్టిలో తాము భక్తులమని తెలియపరిచే యత్నం చెయ్యటం కద్దు. ఇక్కడ చిన్న ఉదాహరణ పూజ్యగురుదేవులు మన ఊరిని సందర్శించినప్పుడు కొందరు భక్తులు

ఆయన దృష్టిలో తాము ఆయన సేవ చేస్తున్నామని తెలియపరిచేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు.  మీకు ఇష్టమని ఈ కాయగూర తెచ్చాను. మీకు ఈ పండు తెచ్చాను… వంటివి.  గురువుకు తాము చెప్పినది విని ఆచరించే భక్తులపై ఉన్న అనురాగం ఈ పైపై వేషాలు వేసే వారిపై ఉండదని భగవాన్ కూడా ఎన్నో సందర్భాలలో చెబుతారు. 

అణ్ణామలైస్వామి కూడా ఈ విషయం వక్కినొక్కాణించారు ఈ గ్రంధంలో. 
“గురువు యొక్క భౌతికరూపంతో బంధం పెట్టుకోవద్దు. అవి ఎప్పటికైనా నశించేవే. హృదయంలో ఆత్మగా ఉపస్థితులైనవారే నిజమైన గురువు” అంటారు భగవాన్. 

ప్రాపంచిక విషయాలపై శ్రద్ధ పెట్టక నిరంతర భగవత్‌ భక్తితో ఆసక్తుడై తిరిగేవారి గుమ్మానికి భగవంతుడు తననుతాను కట్టేసుకుంటాడని భగవాన్‌ చెబుతారు. గృహస్తులు కుడా తమకు అవసరం మేరకు విషయాలపై ఆసక్తి కనపరచి మిగిలిన సమయం దైవచింతన చెయ్యటం వలన ఆత్మవిచారం సాధ్యమని తెలుపుతారు. 
ఏకాంతం కొరకు వెదికితే అది దొరకదు. ఆత్మ ఉన్నచోటనే ఏకాంతం. ప్రపంచం మనఃకల్పితం. ఎక్కడికి వెళ్ళి దాచుకున్నా ప్రపంచం ఉంటుంది. 
కాబట్టి ఆధ్యాత్మిక జీవితం గడపాలనుకున్నవారు ఉన్నచోటనే ఉండి తమలో తాము చూసుకోవటం అలవాటుచేసుకోవాలని చెబుతారు భగవాను. హృదయంలో పరమాత్మను అనుభవించటమై బ్రహ్మానందం. 
అణ్ణామలై స్వామికి భగవాను పూర్ణ బ్రహ్మానందం ప్రసాదించారు. 
అణ్ణామలైస్వామి నిజమైన భక్తునివలె భగవాను బోధనలను పాటించారు. వారు చెప్పినది చేసి పూర్ణజ్ఞానులుగా మిగిలారు. 
ఈ పుస్తకం ముఖ్యంగా వీరు డైరి నుంచి తీసుకున్న విషయాలతో కూర్చబడింది. 
భగవాను చెప్పినట్లుగా ఆహార అలవాట్లు పాటిస్తూ, తననుతాను మార్చుకుంటూ మౌనం పాటిస్తూ ధ్యానం చేస్తూ ఉండిపోయారు అణ్ణామలైస్వామి. భగవాను అంటే ఆ భౌతికదేహం మాత్రమే కాదని అన్నింటా నిండి ఉన్న ఆత్మేయని చెబుతారు. అందుకే తనని కలవవద్దని ఆశ్రమం రావద్దని చెప్పినా భగవాను మాటను పాటిస్తూ ఆత్మదర్శిగా, పరిపూర్ణయోగిగా ముక్తునిగా నిలచారు అణ్ణామలైస్వామి. 
ఈ గ్రంధంలో మనకు సాధనలో కలిగే ఎన్నో ప్రశ్నలు, వాటికి భగవాను సమాధానాలు పొందపరచారు. 
కొన్ని ప్రశ్నలు మనకుఎంతకూ సమాధానం దొరకనివి ఇందులో చర్చించబడ్డాయి. 
ఉదా:
మంచివారికే ఎందుకు బాధలు కలుగుతాయి?
భగవాను సమాధానం; మురికిపోవటానికి బట్టలు బండకేసికొడతారు. భక్తుని మనస్సు శుద్ది చెయ్యటానికే బాధలు. ఓర్చుకుంటే తర్వాత మిగిలేది ఆనందమే. 

ధ్యానం చేసేటప్పుడు ఆపుకోలేని నిద్ర వస్తుంది. ఏం చెయ్యాలి?
భగవాను సమాధానం నిద్రనుంచి మెల్కొన్నావు అంటే అంతకు మునుపు నిద్రపోయావనే కదా. మేలుకువలో ఉన్నప్పుడు కూడా నిద్రలో అనుభవించిన స్థితిలో ఉండగలగాలి. అలాగే నిద్ర వచ్చినప్పుడు మెలుకువగా ఉండగలగాలి. అదే ఎఱుకతో నిద్రపోవటం. 

ఏమీ అక్కర్లేనీ. వాంఛారహిత స్థితి ఉంటే అన్నీ అవే వస్తాయి. 
మన కార్యక్రమాలు మన వల్ల జరగటంలేదని, చోదకశక్తి భగవంతుడే అని అనుకొని దైవాన్ని ప్రేమిస్తే ఆ దైవము చెయి పట్టుకు నడిపిస్తుంది. 
తనను తాను తెలుసుకోకుండా ప్రపంచానికి సహాయం చెయ్యడమంటే అంధుడు కంటిజబ్బులను బాగు చేసినట్లు. 
ఒకరు “ధ్యానం చేయ్యటం మొదలుపెట్టాక సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని అణ్ణామలైస్వామితో మొరపెట్టుకున్నారు. 
“నీ పూర్వవాసనలు సమస్యలలా చుట్టుకుంటున్నాయి. అవి మహాపర్వతంలా కనిపించవచ్చు. భయంలేదు. అవి రాతి పర్వతంకాదు. కర్పూర పర్వతం. వివేకం, విచక్షణాతో కూడిన జ్ఞానజ్యతితో అవి ఇట్టే కరిగిపోతాయి”  అని చెప్పారు స్వామి. 

జన్మతీసుకున్న ప్రతి మానవుడూ ఆత్మవిచారం చెయ్యవలసినదే. ఎందుకంటే విచారము చెయ్యగల బుద్ది కేవలం మానవులకు మాత్రమే ఉంది. మానవ జన్మ వచ్చిందే ఆత్మను తెలుసుకోవటం కోసం. ఇంద్రియ సుఖాల కోరకు కాదు. 
ఇటువంటి ఏన్నో ప్రశ్నలూ సమాధానాలు ఈ గ్రంధంలో ఉన్నాయి. ఆశ్రమములో జరిగిన మర్పులూ, గొడవలు అన్నింటా ఉంటూ ఏదీ అంటని రమణుల నిశ్చల తత్త్వం మనకు ఈ గ్రంధం తెటతెల్లం చేస్తుంది. 
ప్రతి సాధకుడూ తప్పక కొని చదవి పాటించి తిరిగితిరిగి చదువుకుంటూ సాధనలో ముందుకు సాగటానికి సహాయం చేస్తుందీ ఈ గ్రంధం. 
ఇది రమాణాశ్రమంలో ఎప్పుడో కొన్నాము. ఇప్పుటికి చదివే వెసలుబాగు కలిగింది. 
ఇది చదివిన తరువాత ఎంతో సంతోషం కలిగింది. ఎన్నో సందేహాలకు సమాధానం దొరికిందీ గ్రంధంలో. 
ప్రతి ఒక్కరు తప్పక చదవవలసినదని నా వ్యక్తిగత అభిప్రాయం. 

Leave a comment