#అక్కడ – ఇక్కడ
మే,జూన్ లలో ఎక్కడ చూసినా గ్రాడ్యుయేషన్స్ లు, పిల్లలతో పెద్దల పరుగుల లుకలుకలు, పిల్లల పకపకలు కనబడుతాయి. ఐదవ తరగతి నుంచి రిసెర్చ్ వారు వరకూ.
ఇక్కడ, అంటే అమెరికాలో, ఈ గ్రాడ్యుయేషన్ అన్న మాటకి విలువ ఎలా ఇవ్వాలో నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదంటే నమ్మాలి.
ఎందుకంటే, మేము చదువుకునే రోజులలో, 90’s లో అన్నమాట, మాకు డిగ్రీ అయ్యాక ఒకటో రెండో సంవత్సరాలు గడిచాక నాలుగు బాచ్లల వారికీ కలిపి స్నాతకోత్సవం అని జరిపే వారు. దానిలో విద్యార్థులు మాత్రమే వచ్చేవారు. నాకు గుర్తున్నంత వరకు ఎవ్వరూ తల్లితండ్రులను చుసిన గుర్తు లేదు. కాలేజీ టాపరు కానియ్యండి, డిమికి కొట్టి లాగించిన బాపతు కానియ్యండి.
నాకు డిగ్రీ పూర్తి అయిన తర్వాత అసలు నేను స్నాతకోత్సవం (కాన్వకేషన్ ) కి వెళ్ళనే లేదు. మా కాలేజీలో, దుర్గాబాయి దేశముఖ్ మెమోరియల్ అవార్డు నాకు వచ్చినా, అమ్మానాన్నా కాదు నేనే వెళ్ళలేదు, పెళ్లిగోలలో.
అసలు అమ్మా వాళ్ళు పట్టించుకునే వారు కాదు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏమి చదువుతున్నామో కూడా తెలియకపోవటం నాన్నగారు వాళ్ళకి గొప్పగా వుండేది కాబోలు. ఎదో కాలేజీకి వెళ్తున్నారు అని భరోసా. ఇప్పుడు మన పిల్లల మీద భరోసా లేదని కాదు. అలా చేసినా, అసలు ఎలా చేసినా గడిచి పోయేది అప్పుడు. మాకు అమ్మ, నాన్నగార్లని కాలేజీకి వచ్చి నన్ను చూడండి అని డిమాండ్ చెయ్యాలని కూడా తెలియని అయోమయ గందరగోళపు రోజులు అవి.
నేటి ఇక్కడి పిల్లలని చుస్తే అదే అనిపిస్తుంది. నేను ఇంత క్లియర్ గా, డిమాండింగుగా ఉంటె ఏమయ్యది అని. అనుకోవటానికి ఏముంది చెప్పండి,నోరుమూసుకోమనేవారు కదా పెద్దవారు, అని నాకు నేను సమాధానం ఇచ్చుకుంటాను.
అమెరికా వచ్చాక మా అమ్మాయి 5 వ తరగతి ఎలిమెంటరీ స్కూల్ పూర్తి చేసిన ఆ సంవత్సరం, నాకు ఇక్కడి వీళ్ళ హడావిడి చూసి నోరు వెళ్ళ బెట్టాల్సి వచ్చింది. 5 వ తరగతి పూర్తి చేసిన పిల్లలకి గ్రాడ్యుయేషన్ ఉంటుందని చెప్పినప్పుడు అన్నమాట. సరే అదో హడావిడి ఫంక్షన్ అనుకుంటే, కాదు, డ్రెస్ మేకప్ కూడా ఉండాలని నాకు సలహా. నేను “మేసిస్” లో పిల్లకు ఒక బ్లూ గౌను( గౌనును డ్రెస్ అంటారు) కొని, ఫార్మల్ అన్నమాట, వేసి తీసుకువెళ్లాను. పిల్లలో స్రైటు A కేటాగిరి పిల్లలను వేరుగా పిలిచి వారికి ఒక మెడల్, జార్జ్ బుష్ (అప్పుడు బుష్ అధ్యక్షుడు) సంతకంతో ఉన్న సర్టిఫికెట్ ఇచ్చారు. అలా హనికి ఒక మెడల్ సర్టిఫికేటు లభించాయి.
ఈ హడావిడి బడిలో ఎంత పెద్దగా చేశారో. నాకు 5 వ తరగతికే ఈ గ్రాడ్యుయేషన్ హడావిడి అర్థంకాక కొంత, వీళ్ళ పిచ్చి ఏమిటో అర్థం కాక కొంత తికమక పడ్డాను.
ఈ హడావిడి మళ్ళీ 12 తరగతి తరువాత అనుభవంలోకి వచ్చింది. ఇక్కడ ఇండియాలో మల్లె ఇంటర్ ఉండదు. 11 తరగతి, 12 తరగతి ఉంటాయి. 12 తరువాత హై స్కూల్ అయిపోయి, కాలేజీ కి వెళ్లాలనుకునేవారు కాలేజీకి, ఏదైనా జాబ్ లోకి వెళ్లాలనుకునేవారు జాబ్ లోకి వెళ్ళిపోతారు.
అందుకని 12 తరగతి పూర్తి చేశాక అదొక వేడుక.
పిల్ల 12 వ తరగతి పూర్తి చేసే నాటికి నేను అట్లాంటా తెలుగు సంగం అధ్యక్ష పదవిలో ఉండి ఉన్నాను. ఊరంతా వారి వేడుకలకు పిలిచేవారు. మరి నా వంతుగా అందరికీ ఒక బోజనమన్నా పెట్టాలనే అనుకుంటూ ఉన్నప్పుడు,మా అమ్మాయి 12వ తరగతి పూర్తి చేయటం, అమెరికా అధక్ష్య పుర్సకార బహుమతి అందుకోవటం, ప్రపంచ ప్రఖ్యాత ఐవీ లీగ్ కళాశాలలో ప్రవేశం సంపాదించుకోవడం, ఒకదాని వెనుక ఒకటి గొలుసుకట్టులా జరిగి, ఆ వేడుకలకు మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నందున అది వేడుకగా జరుపుకున్నాము.
కానీ నాకైతే ఈ గ్రాడ్యుయేషన్ హడావిడి అంతా ఇన్నిసార్లు ఎందుకు జరుపు కుంటారు అన్న ప్రశ్నకు సమాధానము మాత్రం దొరకలేదు.
అలా చూస్తుండగానే పిల్ల నాలుగేళ్లు గబగబా జరిగిపోయాయి. టైం ఎంత తొందరగా సాగుతుందో అనిపిస్తుంది ఒక్కోసారి. ఒక్కో సారి అసలు కదలదు. ఈ నాలుగు సంవత్సరాలు అంతే ఏంటో హడావిడిగా సాగిపోయాయి.
నాలుగేళ్లలో కాలేజీ లో (ఇక్కడ డిగ్రీ ని అండర్ గ్రాడ్ అంటారు) చదువు పూర్తి చేసుకొని, కాలేజీలో ఉన్నతస్థాయిలో అవార్డులు లీడర్ షిప్ అవార్డులు, మెడల్సు తెచ్చుకొని, పుల్ బ్రైట్ ఫెలోషిప్ తో పాటు కీ నోటు స్పీకర్ గా విజయ పరంపరలు అందుకున్న శుభతరుణమున,అభినందించడానికి, చూసి అందించటానికి, మేము ఫిలడాల్ఫియా వెళ్ళి వారం రోజులు పాటు ఉరుకులు పరుగుల మీద అన్నిట్లో పాల్గొని, అమ్మాయి ఘనవిజయం కళ్ళారా చూసి, శ్లాఘించిన అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలుపుకొని వెనక్కి వచ్చేసరికే మా ప్రయాణం ఒక కధలా సాగింది.
ఈ గ్రాడ్యుయేషన్స్ అన్నవి ఆనందమైన సంఘటనలు ఏ కుటుంబాలకైనాను. ఇక్కడ ఇంత ప్రాముఖ్యత సంతరించు కోవటానికి బహుశా మొదటినుంచి వీరికి చదువు అంత ప్రాముఖ్యమైన విషయం కాకపోవటం కావొచ్చు. లేదా, ఇక్కడి కుటుంబ విచ్ఛిన్న పరిస్థితులు, ఎలాగోలా స్కూల్ చదువు వరకు సాగటం అయితే చాలు అన్న భావన, లేదా తేలికగా అందుబాటులో ఉన్న జీవన విధానం కావొచ్చు. చదువుకు ఆసియా లోను, భారత్ లోనూ ఇచ్చిన ప్రాముఖ్యత ఇక్కడ ఇవ్వరనిపిస్తుంది లోతుగా చూస్తే. మా అమ్మాయి కాలేజి గురించి మాట్లాడేటప్పుడు తన స్నేహితులు తమకు కాలేజీకి వెళ్ళే అవకాశం ఉందో లేదో అని ఆందోళన పడటం నేను చూశాను. బహుశా అందుకే వీరు ఎలిమెంటరీ, హై స్కూల్ కాగానే ఆ విజయమును గ్రాడ్యుయేషన్ అని హంగామా చేస్తారులా ఉంది.
ఏమైనా మన భారతీయ తల్లితండ్రులలా పిల్లల కోసం సర్వం సమకూర్చు వారు ఇండియా అవతల తక్కువే చూసుకుంటే.
మన పటిష్ట కుటుంబ వ్వవస్థ మన కున్న అతి పెద్ద సంపద. దాన్ని కాపాడుకోవటం కూడా మన విధి, ధర్మం అని నా అభిప్రాయం.
Sandhya Yellapragada