vangibadh –

“తప్పుచెయ్యటం నేరం కాదు,
కారణం తెలుసుకోకపోవటం మహా ఘోరం ” అన్నాడు శ్రీ. శ్రీ.

యండమూరి కూడా ‘తప్పుచేద్దాము రండి’ అని పిలిచారు మీకు గుర్తుందో లేదో…

అసలు ఒక్కసారైనా ఫెయిల్ కాకపోతే వారిని అన్ని తెలిసిన వారిగా పరిగణించరు కొందరు.
కొన్ని ఉద్యోగాలలో అయితే ఒక్కసారి కూడా ఫెయిల్ అయిన అనుభవము తెలియక పొతే, రిస్క్ మ్యానేజ్మెంటు ఎలా చేస్తారని వారిని దూరం పెట్టటం కూడా కద్దు.
‘ఒకటి రెండు చెడితే కానీ వైద్యుడు కాడని’ మనకు సామెత కూడా ఉంది కదా మరి!!

ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే,   మొన్న నా వంకాయ దిజాష్టర్ జరిగి అట్టే రోజులు కాలేదు కదా! “మళ్ళీ వంకాయా!!” అంటూ నీలుగుతూ నిక్కుతూ ఉండకుండా ఏదైనా చెయ్యాలని గట్టి నిర్ణయానికి రావటానికి. అయినా ఎంత కష్టం వచ్చినా, ఎంత త్వరగా మనం కోలుకొని ముందుకు నడుస్తామో, దాని బట్టి కదా మనం ఎంత గట్టివాళ్ళమో తెలిసేది. అందుకే ఇంట్లో ఉన్న చిన్నచిన్న నవనవ లాడే ఈ వంకాయలకు అన్యాయం చేస్తే వచ్చే జన్మలో వంకాయ అంటే ఏంటో తెలియని ఏ అండమానులో, ఆఫ్రికా లోనో పుట్టాల్సి వస్తుంది. అందుకే ఆ శాపాలకంటే ఈ ప్రయాసే ఉత్తమమని కూడా అనిపించి గట్టి నిర్ణయానికి వచ్చాను….
వంకాయలతో ఎన్నో రకాల రెసిపీ లు ఉన్నాయో అన్నీ చెయ్యటానికి. ప్రస్తుతానికి ఈ పరిస్తితులలో “వాంగీబాద్” తో బాదటం ఉత్తమం అని నిర్ణయించుకున్నా. షాబాద్, షంషాబాద్ కాదు వాంగీ బాదే.
ఈ వంటకము లో బాదుడు వుండదు. బానే వుంటుందీ. కర్నాటకలో చేస్తారు దీన్ని ఎక్కువగా.
దీనితో రిస్క్ తక్కువ. కాయ చేదు వచ్చినా, చెడిపోదు వంటకం.
అసలు దీనితో నాకు ఉన్న అనుబంధం పూరాతనమైనది.

మళ్ళీ రింగులు రింగులు – flashback అన్నమాట!!
అప్పుడు… అంటే మేము భారతదేశం వదిలి వచ్చిన కొత్తల్లో రోజు రోజూ వంట, అంట్లు, చీపురు, చేటా గా జీవితం ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో, నేను అంత పనీ రోజంతా చేస్తూ…ముక్కుతూ మూలుగుతూ ఉండే రోజులలో…. ఒక కూరగాయ తో అన్నం, రైతా చేసేసి …వడ్డిస్తూ ఉండేదాన్ని…..
నాకు కొంత పని తగ్గినట్లుగా ఉండేది. అప్పుడే నేను రైస్ లలో రకరకాలు కనిపెట్టి మరి చేసేదాన్ని. ఏ పుణ్యకాలంలో ఈ వాంగీబాత్ తో నాకు బంధం ఏర్పడిందో కానీ, దీనిని అతిగా చెయ్యటం, మా మిత్రబృందానికి చాల నచ్చటం జరిగింది. నేను చేసే రకరకాల రైస్ ఐటమ్స్ కి చాల పేరు వచ్చింది మా చిన్న ఇండియన్ కమ్యూనిటీ లో. అప్పటికి నాకు వంటలో అంత కాంఫిడెన్స్ లేదంటే ఎవ్వరు నమ్మే వారు కారు. ఏంటో అన్ని ఆలా కుదిరేవి….
మొత్తానికి అలా మనం ‘ఆముదపువృక్షములా’ వెలిగిపోతున్నప్పుడు, అమ్మ వచ్చి నాతో కొన్ని రోజులు ఉండటానికి.

అమ్మ అసలు ఎక్కడికి వచ్చినా వూరికే కూర్చునే తరహా కాదు. కిచెన్ లో పని తీసుకొని తిరిగి వెళ్ళే వరకూ వండిపెడుతూ ఉండేది అందరికి. మా అమ్మమ్మ ఇంటికి వెళ్లినా ఈవిడే వంట పని, అక్కయ్య దగ్గరా తనే…
అందుకే నాకు ఎప్పుడు కోరిక అమ్మను అసలు పని చెయ్యనీయ్యకుండా చూసుకోవాలని. మన అత్తగారులు వస్తే కూర్చొని చేయించుకుంటారు. అమ్మలు వస్తే , మనం వాళ్ళని వంటవాళ్ళు గా చెయ్యకూడదని నా నమ్మకం.
అందుకే అమ్మని అసలు ఒక్క సారి కూడా వంట చెయ్యనియ్య లేదు. తాను రెస్ట్ తీసుకునే టైపు కాదు. ఊరికే ఉండకుండా అమ్మ అప్పుడు ఒక పెద్ద త్రో అల్లి పెట్టింది. మా ఇంట్లో కర్టెన్లు అన్ని కుట్టి పెట్టింది. అది వేరె విషయము.
అలా అమ్మ వున్నప్పుడు నా వంటలలో నా ప్రతాపాని  ప్రదర్శించాను ఇలా రకరకాలైన అన్నాలతో. అన్నిటిలోకి అమ్మకి వాంగీబాత్ బాగా నచ్చింది.
దానికి తోడు శ్రీవారికి వంకాయ చాలా చాలా ఫేవరెట్ కాయగూర.
అమ్మ నన్ను ఎలా చెయ్యాలి ఈ వాంగీబాత్ అని అడగటం….
నేను ఎవరెస్టు ఎక్కినంత సంబరంలో…
“ఏమిలేదు అమ్మా ! ఈ వాంగీబాత్ మిక్స్ తెచ్చి, వంకాయ తో కలిపి అన్నంలో కలపటమే… పరమ ఈజీ అనుకో” అంటూ పోజ్  కొట్టాను.
కొంచం అలగే అయినా నా ఉదేశ్యం ఆ రెడీమేడ్ ప్యాకెట్ మీద చేసే విధానం ఉంటుంది. దానికి పెద్దగా రెసిపీ మనం చూడనక్కర్లేదు.
అమ్మ అలా ఆలోచించినటు లేదు. మక్కికి మక్కి  మీనింగ్ తీసుకుంటుందని నేను అనుకోలేదు.
అమ్మ ఎంతో అమాయకురాలు పాపం….
హైదరాబద్ వెళ్ళాకా … ఆ రెడీమేడ్ ప్యాకెట్ తెచ్చి, వంకాయలో ఈ పొడి అన్నంలో కలిపి నాకు,తనకి వడ్డించింది.
నేను అప్పుడు అర్థం చేసుకున్నా అమ్మ నేను చెప్పిప్న రెసిపీ విని ఇంక ప్రాసెస్ చూసుకోకుండా అన్నంలో పొడి కలిపి మాకు వడ్డించిందని.
పాపం కదా!!
నేను అమ్మతో
“అమ్మా! నాకు నీవు  చేసినట్లుగా వంట రాదు..” ఎదో ఇలాంటివి చేసి కాలం గడిపేస్తాను… నీవు  చేసే వాటి ముందు ఇవ్వన్నీ నిలపడవు… నీవు చేసే విధంగానే మాములు వంట చెయ్యి ప్లీజ్!” అని అనునయించాను ….  ఆ రోజు కొండల్ నామీద ఇంతెత్తున లేచాడు. అమ్మకు నేను ఏవో చెత్తవి వండి, తన అద్భుతమైన వంటను చెడగొట్టానని….
మొత్తానికి అలా మా ఇద్దరికీ పెళ్లి అయిన కోత్తల్లో వాంగీబాద్ అతిగా వండటము జరిగేది.
ఎందుకో ఈ మధ్య వాంగీబాత్ అసలు చెయ్యలేదు. మొత్తానికి ఈ రోజు వంగీబాత్  ఆనాటి విషయాలు గుర్తుకు తెచ్చింది.

మళ్ళీ ఇన్ని రోజులకు ఇలా తిరిగి మొదలెట్టుకుంటున్నాను అన్నమాట!!

మొత్తానికి రెసిపీ ఏమంటే: రెడీమేడ్ మసాలా తెచ్చుకుంటే, దాని మీద ఉన్న ప్రాసెస్ ను అనుకరించే చేసుకోవాలి.
లేకపోతే 2 కప్పు ల అన్నానికి:
వంకాయలు చిన్నవైతే 8, పెద్దవైతే 6 తీసుకోవాలి.

మాసాలకి కావలసినవి సరుకులు:
1/2 కప్ వేరుశనగ పప్పు,
2 చెంచాలు నువ్వులు,
1చెంచా గసగసాలు,
1/2 కప్ ఎండు కొబ్బరి
1. స్పూన్ మిరియాలు
1 స్పూన్ ధనియాలు
వీటిని డ్రై గ వేయించుకొని తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి పొడి లా మిక్సీలో  చేసుకోవాలి.
వంకాయలు కడిగి, పులుసు లోలా ముక్కలు చెయ్యాలి. (నీళ్లలో ఉప్పు కొద్దిగా కలిపి ఈ కట్ చేసుకున్న వంకాయని వేసి ఉంచుకోవాలి).
ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి ఉంచుకోవాలి.
3 పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు.
బాండిలో నెయ్యి వేసి, తాలింపు కు ఆవాలు,శనగపప్పు , మినప పప్పు , జీరా,ఎండుమిర్చి, ఇంగువ వేసి చిటపట మనిపించి, ఉల్లిపాయ ముక్కలు కలివి వేయించుకోవాలి.
చిటికెడు పసుపు కూడా వెయ్యాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగాక 10 జీడిపప్పు పలుకులు కూడా కలపాలి.
తరిగిన వంకాయ ఈ వేపుడుకి కలిపి, మూత పెట్టుకోవాలి. సన్నని సెగ మీద 5 నిముషాలు ఉంచాలి.
మధ్య మధ్య లో కలుపుతూ ముక్క మెత్తపడేవరకు ఉంచాలి.
కొద్దిగా చింతపండు నీరు కూడా కలపాలి ముక్క మెత్తపడ్డాక. దీనికి రెడీ చేసి పెట్టుకున్న మసాలా , ఉప్పు కూడా కలిపి 2 నిముషాలు మగ్గనియ్యాలి.
వంకాయ బాగా మెత్తపడిందని అనిపించాక వండుకున్న రెండు కప్పుల అన్నము కలపాలి. కొద్దిగా కొతిమీర వేసి పెరుగు పచ్చడితో కానీ, అవకాయతో కానీ వడ్డించండి.

ఈ మసాలా ఓపిక ఉంటే రెడీ చేసుకు పెట్టుకుంటే చాలా రోజులు నిలువ ఉంటుంది.
ఫ్రీజర్ లో పెట్టుకున్న పొడులు ఎంతకాలమైనా ఘాటు తగ్గక అలాగే ఉండటం గమనించే ఉంటారు.
అదండి వాంగీబాత్ వండటం…. వడ్డించటం…
వహ్వా వంకాయా !!
తింటే వంకాయే తినాలి…
చూస్తే ఎన్టీవోడి మాయాబజారే చూడాలి….
అని అనిపించక మానదు…
అందుకనే మంచు కన్నా చల్లగా ఉండే ఈ శీతాకాలాన్నీ వంకాయతో పగలకొట్టి… భయాన్ని చేట్టేకించి…. వండేశాను నేను సైతం
మళ్ళీ విజృంభించి….
వంకాయని….
PS: టెస్టు చెయ్యబడినది… ప్రూవు కూడా చెయ్యబడినది. కాబట్టి నిర్బయంగా వండవచ్చు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s